తరలొచ్చిన పార్టీశ్రేణులు
సమ్మేళనానికి హాజరైన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ను గెలిపించాలి
కార్యకర్తలకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దిశానిర్దేశం
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయం
సీఎం కేసీఆర్ విజన్‌తో రాష్ట్రం అన్నిరంగాల్లో ముందంజ
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేఖ విధానాలను తిప్పికొట్టాలి
ఎన్నికల సమయంలో బీజేపీకి గుణపాఠం చెప్పాలి
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్ : దేశంలో మరే రాష్ట్రంలో లేని అభివృద్ధి, సంక్షేమ పథకాలు మన
రాష్ట్రంలో అమలవుతున్నాయని, ఉమ్మడి పాలనలో వెనుకబాటుకు గురైన తెలంగాణ
ప్రాంతం ఇప్పుడు అన్ని రంగాల్లో ముందంజలో ఉందని అటవీ, పర్యావరణ, న్యాయ,
దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం ఓ కమ్యూనిటీ
హాల్ లో నిర్మల్ పట్టణ బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం
నిర్వహించారు. సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్
రెడ్డి మాట్లాడుతూ రైతుల కోసం అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరే ఇతర
రాష్ట్రంలోనూ అమలు కావడం లేదన్నారు. పొరుగు రాష్ట్రాలు సైతం తెలంగాణ పథకాలు,
పాలన వైపు చూస్తున్నాయన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత నిర్మల్ జిల్లా
కేంద్రంలో విద్య, వైద్య రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించగలిగామని అన్నారు.
దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారు రెండవ సారి ఎమ్మెల్యేగా
గెలవరని ప్రతిపక్షాలు విమర్శించాయని, అయినా సీయం కేసీఆర్ సహకారంతో,
దేవుని ఆశిస్సులతో, ప్రజల దీవెనతో మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి రెండవ సారి
దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి, జిల్లాలో అనేక ఆలయాలను
అభివృద్దికి కృషి చేస్తున్నానని వివరించారు. నిరంతరం రాష్ట్ర అభివృద్ధి కోసం
పరితపిస్తున్న కేసీఆర్‌ను మనమంతా మరోసారి ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు.
రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు
సైనికుల్లా పనిచేయాలని, ప్రతిపక్షాల మాటలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి గడపకూ తీసుకెళ్లాలని, ప్రజలతో పథకాలపై
చర్చిస్తూ వారిలో చైతన్యం తీసుకురావాలని కోరారు. సీఎం కేసీఆర్ 9 ఏండ్లలో
రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిపారన్నారు. పొరుగు
రాష్ట్రాలు సైతం తెలంగాణ పథకాలు, పాలన వైపు చూస్తున్నాయన్నారు. నిరంతరం
రాష్ట్ర అభివృద్ధి కోసం పరితపిస్తున్న కేసీఆర్‌ను మనమంతా మరోసారి
ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. 8 ఏండ్లుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో
ఉందని, ఇచ్చిన మాటకు కట్టుబడి బీజేపీ పాలన చేసిందా..? అని ప్రశ్నించారు.
నల్లధనం తీసుకువచ్చి ప్రతిఒక్కరి అకౌంట్లలో రూ.15లక్షలు వేస్తానని ప్రధాని
మోదీ చెప్పారని, ఎవరికైనా వేశారా..? అని ప్రశ్నించారు. అదే విధంగా
నల్లధనాన్ని అరికట్టేందుకు పెద్ద నోట్లను రద్దు చేశారని, నల్లధనం
అరికట్టడం ఏమో గాని సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని కేంద్ర
ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన తప్పుపట్టారు. ఇవన్ని చాలవన్నట్లు
పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచారని, రూ.400 ఉన్న వంటగ్యాస్
సిలిండర్ ధరను రూ.1200లకు పెంచారని మండిపడ్డారు. దేశానికి అన్నం పెట్టే
రైతన్నల కడుపు కొట్టింది మోడీ ప్రభుత్వం కాదా అని నిలదీశారు. ఇలా
ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రం ప్రభుత్వ ప్రజా వ్యతిరేఖ విధానాలను
సీయం కేసీఆర్ ఎండగడుతున్నందుకే ఇటు తెలంగాణను అటు సీయం కేసీఆర్ కుటుంబ
సభ్యులపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వివరించారు.
ఇదంతా చేస్తూ… ఏ ముఖం పెట్టుకొని తెలంగాణలో జెండా పట్టుకొని తిరుగుతారని
బీజేపీ నాయకులను ఉద్దేశించి మంత్రి ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా
వ్యతిరేఖ విధానాలను తిప్పికొట్టాలని, ఎన్నికల సమయంలో బీజేపీకి తగిన
గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపినిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా బీఆర్ఎస్
ఇంచార్జ్ గంగాధర్ గౌడ్, ప్రజాప్రతినిధులు, నిర్మల్ పట్టణ బీఆర్ఎస్
నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.