276 వ వార్డు సచివాలయ పరిధిలో మూడో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ : నాలుగేళ్ల పాలనలో రాష్ట్రంలోని ప్రతీ గడపపై సీఎం వైఎస్ జగన్మోహన్
రెడ్డి తనదైన సంక్షేమ ముద్ర వేశారని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్
ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. మంగళవారం 63 వ డివిజన్ 276 వ వార్డు
సచివాలయ పరిధిలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక
కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
నిర్వహించారు. రాధానగర్‌లో విస్తృతంగా పర్యటించి 174 గడపలను సందర్శించారు.
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా రచ్చబండ కార్యక్రమంతో మూడు
నెలలకోసారి అధికార యంత్రాంగాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్లి జవాబుదారీతనం
పెంచారని మల్లాది విష్ణు గుర్తుచేశారు. మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్సార్ కలలు కన్న స్థానిక సుపరిపాలనను సచివాలయ
వ్యవస్థ రూపంలో సాకారం చేసి చూపారన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలు,
అభివృద్ధి పనులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. వారి నుండి సలహాలు, అర్జీలు
స్వీకరించారు. టీడీపీ హయాంలో టిడ్కో ఇళ్ల పేరిట చేసిన మోసాన్ని పలువురు
బాధితులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చి ఆవేదన వ్యక్తం చేయగా న్యాయం
చేస్తామని మల్లాది విష్ణు హామీనిచ్చారు. ఇంకా ఎవరికైనా సంక్షేమ పథకాలు
అందకపోతే అడిగి తెలుసుకుని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
లబ్ధిదారుల హర్షాతీరేకాలు
గత తెలుగుదేశం ప్రభుత్వం అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలను ఎలా కత్తిరించాలా
అనే ఆలోచన చేస్తే జగనన్న ప్రభుత్వం అర్హులను వెతికి మరీ లబ్ధి చేకూరుస్తోందని
మల్లాది విష్ణు అన్నారు. సంక్షేమ పథకం అందని కుటుంబం సచివాలయ పరిధిలో ఒక్కటి
కూడా లేకపోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు తమ
ఆనందాన్ని ప్రజాప్రతినిధులతో పంచుకున్నారు. తమ కుటుంబానికి జగనన్న
విద్యాదీవెన, వసతి దీవెన, వైఎస్సార్ ఆసరా, అమ్మఒడి, పింఛన్ కానుక, సున్నావడ్డీ
(డ్వాక్రా) పథకాలు వర్తించినట్లు లబ్ధిదారు జగ్గరాజు రమణ తెలిపారు. గత
మూడున్నరేళ్లలో అక్షరాలా రూ. 10 లక్షల 23 వేల 465 రూపాయల సంక్షేమం తమ
కుటుంబానికి అందినట్లు మరో లబ్ధిదారు మంగళగిరి సీత మహాలక్ష్మి చెప్పారు. అలాగే
మరికొందరు లబ్ధిదారులు గతంలో తాము ఎదుర్కొన్న సమస్యలను, ఈ ప్రభుత్వంలో పొందిన
లబ్ధిని వివరించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి తాము అండగా ఉంటామని
చెప్పారు.
చంద్రబాబువి ఊసరవెల్లి రాజకీయాలు
చంద్రబాబువి ఊసరవెల్లి రాజకీయాలు అని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది
విష్ణు విమర్శించారు. ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమానికి
వెల్లువెత్తుతున్న ప్రజాదరణపై దృష్టి మరల్చేందుకు పన్నుల పేరిట లేనిపోని
రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. గోబెల్స్ ప్రచారాన్ని నమ్ముకుని,
ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చేందుకు కుట్రలు పన్నుతూ ప్రజలలోకి తప్పుడు
సంకేతాలు పంపుతున్నారని దుయ్యబట్టారు. తన హయాంలో ఎడాపెడా పన్నులను బాదేసిన
చంద్రబాబు ఇప్పుడు పన్నుల గూర్చి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఉమ్మడి
ఏపీకి ముఖ్యమంత్రిగా ఉండగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి
ఐవైఆర్ కృష్ణారావు 2002, మార్చి 14న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ను
చంద్రబాబు మరిచారా..? అని మల్లాది విష్ణు ప్రశ్నించారు. గ్రామాలలో ఇంటి పన్ను
రూపంలో వసూలుచేస్తున్న దాంట్లో కొంత మొత్తం అదనంగా ‘యూజర్ ఛార్జెస్ ఫర్
డ్రైనేజీ ఫెసిలిటీ’కి అప్పట్లో ఈ నోటిఫికేషన్ ను జారీ చేశారని గుర్తుచేశారు.
2014-19 మధ్యకాలంలోనూ చంద్రబాబు సర్కారు ప్రజల నడ్డి విరిచిందని మల్లాది
విష్ణు విమర్శించారు. ప్రమాదాల సమయంలో ఫైర్ ఇంజన్ల ద్వారా సేవలు
అందిస్తున్నందుకుగానూ ప్రత్యేకంగా ఫైర్ ట్యాక్స్ వసూలుకు 2014, డిసెంబర్ 3న
ఆదేశాలు జారీచేశారని.. అలాగే గ్రామాల్లో వసూలు చేసే ఇంటి పన్నులో 3 శాతం
చొప్పున స్పోర్ట్స్ ఫీజు రూపంలో వసులుకు 2014, నవంబర్ 18న మరో జీవోను ఇచ్చింది
వాస్తవం కాదా..? సమాధానం చెప్పాలన్నారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించమని అడిగిన
అమాయకులపై బషీర్‌బాగ్ లో కాల్పులు జరిపించిన చరిత్ర చంద్రబాబుదని, మరలా ఏం ముఖం
పెట్టుకుని పన్నులపై మాట్లాడతారని మల్లాది విష్ణు విమర్శించారు. తెలుగుదేశం
హయాంలో విద్యుత్ రంగం పూర్తిగా కుదేలైందని.. చంద్రబాబు చేసిన తప్పులకు
రాష్ట్రం అంధకార ప్రదేశ్ గా మారకూడదన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తోందని
తెలిపారు. అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలతో స్వచ్ఛ సర్వేక్షణ్ లో
విజయవాడ నగరం దేశంలోనే మూడవ స్థానంలో నిలిచిందని చెప్పుకొచ్చారు. కనుక పదే పదే
అబద్దాలు మాట్లాడినంత మాత్రాన నిజమైపోదని.. 2019 లో వదిలించుకున్న దరిద్రాన్ని
మరలా ఆహ్వానించేందుకు ప్రజలు సిద్ధంగా లేరని మల్లాది విష్ణు పేర్కొన్నారు.
కార్యక్రమంలో సీఈ(ఇంజనీరింగ్) ప్రభాకర్, ఈఈ(ఇంజనీరింగ్) శ్రీనివాస్, డీఈ(వాటర్
సప్లై) రామకృష్ణ, ఏఈ అరుణ్ కుమార్, సీడీఓ జగదీశ్వరి, డివిజన్ కోఆర్డినేటర్
పసుపులేటి యేసు, నాయకులు మోదుగుల గణేష్, సీహెచ్ రవి, ఉద్ధంటి శ్రీను,
సామ్రాజ్యం, వీర్ల శ్రీను, మండాది వెంకట్రావు, బుడే, నాగలక్ష్మి, అన్ని శాఖల
అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.