విజయవాడ : ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏపీ జేఏసీ అమరావతి చేపట్టిన మలిదశ
పోరాటానికి ఏపీ భాషోపాధ్యాయుల సంస్థ చేయి కలిపింది. విజయవాడలో జరిగిన
భాషోపాధ్యాయుల సంస్థ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం
తీసుకున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్..
ఉపాధ్యాయులందరూ పోరాటానికి ముందుకు రావాలని కోరారు. దశలవారీగా ఉద్యమాన్ని
ఉద్ధృతం చేస్తామన్నారు. భాషా పండితులకు పదోన్నతి కల్పించాలని, జీవో నెంబర్
77ను రద్దు చేయాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్
భాష ఉపాధ్యాయుల సంస్థ రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడలోని రెవెన్యూ భవన్ లో
జరిగింది. ఈ కార్యక్రమానికి అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు
ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మలిదశ ఉద్యోగుల ఉద్యమం ప్రారంభమైందని బొప్పరాజు
అన్నారు. దశలవారీగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామన్నారు. సిపీఎస్, పీఆర్సీ వంటి
సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఒకటో తేదీ నాడే ఉద్యోగులకు
జీతాలు చెల్లించాలన్నారు. భాషా పండితులను పదోన్నతి కల్పించాలని కోరారు. ఉన్నత
పాఠశాలలో ఉపాధ్యాయులుగా భాషా పండితులని నియమించాలని తెలిపారు. ఎస్జీటీలుగా
భాషా పండితులకు పదోన్నతి కల్పించాలన్నారు. భాషా ఉపాధ్యాయుల పదోన్నతుల్లో
సమస్యలు సృష్టిస్తున్న జీవో నెంబర్ 77 రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఉద్యమంలో ఉపాధ్యాయులు
ఎమ్మెల్సీ ఎన్నికలు, మరోవైపు 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో తమతో
ఉపాధ్యాయులు కలిసి రావడం ఆలస్యమైందని బొప్పరాజు పేర్కొన్నారు. ఆలస్యమైనా
ఉపాధ్యాయులు సైతం ఉద్యమంలో బాగాస్వామ్యం కావాలని నిర్ణయించారని బొప్పరాజు
వెల్లడించారు. రాష్ట్రంలో పని చేస్తున్న 13లక్షల ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే
న్యాయమైన చెల్లింపులు, ఇతరత్ర ప్రయోజనాలపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి
వ్యతిరేకంగా ఉద్యమం చేపడుతున్నట్లు వెల్లడించారు. ఏపీ జేఏసీ అమరావతి చేపట్టే
ఉద్యమానికి రాష్ట్ర ప్రధానోపాధ్యాయుల సంఘం సైతం మద్దతు తెలిపిందని
వెల్లడిచారు. మున్సిపల్ టీచర్స్ సైతం మద్దతు ఇచ్చే అంశంపై నిర్ణయం
తీసుకున్నారని బొప్పరాజు వెల్లడించారు. తాము చేయబోయే ఉద్యమానికి ఉపాధ్యాయులు
మద్దతు తెలుపడంతో తమకు మరింత బలం చేకూరినట్లయిందని పేర్కొన్నారు.నిరసన, ధర్నా
కార్యక్రమాల వివరాలు: అమరావతి ఉద్యోగుల జేఏసీ చేపట్టబోయే కార్యాచరణ బొప్పరాజు
వెల్లడించారు. తమకు మద్దతు ఇచ్చే ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టే
కార్యక్రమాల వివరాలు తెలిపారు. 10వ తేదీన నల్ల మాస్క్‌లు దరించి ఉద్యోగుల 26
జిల్లాల్లో కలెక్టర్ స్పందనలో వినతులు ఇస్తామన్నారు. 11వ తేదీ నుంచి
ఉద్యోగులమంతా సెల్ ఫోన్ డౌన్ చేస్తామని పేర్కొన్నారు. 12వ తేదీ నుంచి ధర్నా
కార్యక్రమాలు చేపడతామన్నారు. ఇందులో ఉద్యోగులు, పెన్షనర్స్ కలిసి సమస్యలపై
ధర్నా నిర్వహిస్తామన్నారు. 18వ తేదీన ఉపాధ్యాయులు, సీపీఎస్ ఉద్యోగులతో కలిసి
వారి సమస్యలపై ధర్నాలో పాల్గొంటామని వెల్లడించారు. 25వ తేదీన కాంట్రాక్ట్,
అవుట్ సోర్స్ ఉద్యోగుల సమస్యలపై ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. 29వ తేదీన
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై ధర్నా చేపడతామని పేర్కొన్నారు. జీతాలు
1వ తేదీన ఇవ్వడం లేదు. అందు కోసం బ్యాంక్‌లతో మా సమస్యలు వెల్లడించి ధర్నా
నిర్వహిస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి ఉద్యోగులకు రావల్సిన ఆర్థిక,
శాఖపరమైన సమస్యలతో పాటుగా ఇతరత్ర సమస్యలు సత్వరమే పరిష్కరించాలని బొప్పరాజు
డిమాండ్ చేశారు.