అవినీతి పునాదుల మీద లేచిన బతుకులు మీవి
రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ : సంక్షేమ పాలకుడిగా పేరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్
రెడ్డి భవిష్యత్తు తరాలకు భరోసాగా నిలబడుతున్నారని ప్లానింగ్ బోర్డు
ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు.
సత్యనారాయణపురంలోని 217 వ వార్డు సచివాలయ పరిధి శివరావు వీధిలో ‘జగనన్నే మా
భవిష్యత్తు’ కార్యక్రమం రెండో రోజు ఉత్సాహపూరిత వాతావరణంలో కొనసాగింది.
కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్
శర్వాణీ మూర్తితో కలిసి ఆయన పాల్గొన్నారు. సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులతో
కలిసి స్వయంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజాభిప్రాయాలను తెలుసుకున్నారు. గత
ప్రభుత్వ పనితీరు, ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసాన్ని ప్రజలకు
వివరించి కరపత్రాలను అందజేశారు. పార్టీ స్టిక్కర్లను వారి అనుమతితో ప్రతి
ఇంటికి, ఫోన్లకు అంటించారు. ‘జగనన్నే మా భవిష్యత్తు’ అనేది పార్టీ
కార్యక్రమంలా కాకుండా జనం గుండె చప్పుడుగా మారిందని ఈ సందర్భంగా మల్లాది
విష్ణు పేర్కొన్నారు. ‘మా నమ్మకం నువ్వే జగన్’ అనేది కూడా ప్రజల నుంచి పుట్టిన
నినాదం మాత్రమే కాదని, సీఎం జగన్ పై చెక్కుచెదరని ప్రజల ప్రగాఢ విశ్వాసానికి
ప్రతీక అని తెలిపారు. ప్రధానంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, సచివాలయ
వ్యవస్థపై ప్రజలల్లో స్పందని బాగుందని పేర్కొన్నారు. తాము అడుగుతున్న
ప్రశ్నలకు, ప్రజలు ఇస్తున్న సమాధానాల్లో జగనన్న ప్రభుత్వంపై వారికి పెరిగిన
సంపూర్ణ విశ్వాసం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కార్మిక, కర్షక, మహిళ, యువత
సహా అన్ని వర్గాల ప్రజలు ‘మా నమ్మకం నువ్వే జగన్’ అని ముక్తకంఠంతో అంటుంటే
చంద్రబాబు, పచ్చ నేతలు మాత్రం ఓర్వలేకపోతున్నారని మల్లాది విష్ణు విమర్శించారు.
సెల్ఫీ బాబుకి టిడ్కో బాధితులతో ఫోటో దిగే ధైర్యముందా? : సెల్ఫీ బాబు ఫోటో
దిగాల్సింది అక్కడెక్కడో కాదని, జన్మభూమి కమిటీల ద్వారా మోసపోయిన టిడ్కో
లబ్ధిదారులతో విజయవాడ నగరంలో సెల్ఫీ దిగాలని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు.
ఆనాడు పేదల సొంతింటి కలను ఆసరాగా తీసుకుని కనీసం స్థలాలు కూడా లేకుండా నగరంలో
11,917 మంది దగ్గర డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. కేవలం కాగితాలలో ఇళ్లను
చూపి ఒక్కో లబ్ధిదారుని వద్ద రూ. 50 నుంచి రూ. లక్ష వరకు అప్లికేషన్ల రూపంలో
దోచుకు తిన్నారన్నారు. ఇందులో 6,576 ఇళ్లు 50 శాతం కూడా పూర్తికాలేదని.. 5,341
మందికి కనీసం స్థలం కూడా చూపలేదన్నారు. ఇదంతా తెలుగు తమ్ముళ్ల అవినీతి కాదా..?
అని సూటిగా ప్రశ్నించారు.
అవినీతి పునాదుల మీద లేచిన బతుకులు మీవి : స్కిల్ డెవలప్మెంట్ స్కాం, ఈఎస్ఐ
కుంభకోణం, ఉపాధి హామీ పథకం, అమరావతి, ఫైబర్ గ్రిడ్, టిడ్కో ఇళ్లల్లో భారీ
అవినీతికి పాల్పడిన తెలుగుదేశం నేతలు నీతులు చెప్పడం దెయ్యాలు వేదాలు
వల్లించినట్లు ఉందని మల్లాది విష్ణు పేర్కొన్నారు. చివరకు కార్మికుల సొమ్మును
దోచుకుని అరెస్టైన అచ్చెన్నాయుడు కూడా సీఎం జగన్ గూర్చి మాట్లాడటం
సిగ్గుచేటన్నారు. ఒక టికెట్ ఇస్తే నలుగురు ఎమ్మెల్యేలు వస్తారని
అచ్చెన్నాయుడు మాట్లాడటం బుర్రలేనితనమని మండిపడ్డారు. 2019 లో రాష్ట్ర
ప్రజలందరూ కర్రు కాల్చి వాతపెట్టినా టీడీపీ నేతల తీరు మారలేదని
అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రజలందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డినే మరలా తమ
ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకుంటున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. ప్రజల
చల్లని దీవెనలతో మరో 30 ఏళ్లు రాష్ట్రంలో సంక్షేమ సారథిగా సీఎం జగన్ పాలన
సాగడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డివిజన్ కోఆర్డినేటర్
దోనేపూడి శ్రీనివాస్, నాయకులు లంకా బాబు, మైలవరపు రామకృష్ణ, మాదాసు గోపాల్,
ఉప్పు రంగబాబు, కోలవెన్ను రమణ, ఎస్.మధు, చల్లాప్రగఢ గోపాలకృష్ణ, నాదెండ్ల
రవిశంకర్, చామర్తి మూర్తి, సనత్, చాంద్ శర్మ, సత్యవాణి, మల్లెల్ల లక్ష్మి,
అమ్మూజీ, తాడంకి భాస్కర్, తాడంకి లావణ్య, కంభంపాటి ప్రసాద్, కృష్ణమోహన్,
సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.