విశాఖలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై సిట్ విచారణ జరిపిస్తాం
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
*విశాఖపట్నం : ఎస్సీలు అభివృద్ధి చెందాలంటే సైకిల్ పాలన రావాలని టీడీపీ
అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖలోని వి.కన్వెన్షన్ సెంటర్లో
నిర్వహించిన తెలుగుదేశం జోన్-1 సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
పాలనలో ఎస్సీలపై దాడులు పెరిగాయని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.
ఎస్సీలను వేధిస్తున్నారని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
విశాఖలోని వి.కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న తెలుగుదేశం జోన్-1 సమీక్షా
సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. అందరికీ సమాన అవకాశాలు, సమాన గౌరవం దక్కేలా
తెలుగుదేశం పార్టీ పనిచేసిందని గుర్తు చేశారు. ఎస్సీలు అభివృద్ధి చెందాలంటే
సైకిల్ పాలన రావాలని చంద్రబాబు అన్నారు. బాబూ జగ్జీవన్‌రామ్ స్ఫూర్తితోనే
తెలుగుదేశం పార్టీ పనిచేస్తోందన్నారు.
పట్టభద్రుల ఎన్నికల్లో ట్రైలర్ చూపించాం : మొన్న జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ
ఎన్నికల్లో ట్రైలర్ చూపించామని చంద్రబాబు అన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల
ఎమ్మెల్సీగా గెలిచిన వేపాడ చిరంజీవి, చివరి నిమిషంలో టికెట్ మార్పునకు
సహకరించిన చిన్ని లక్ష్మీ కుమారిని చంద్రబాబు సత్కరించారు. ఈ సందర్భంగా
చంద్రబాబు మాట్లాడుతూ ‘‘ ఒక గెలుపు ఉత్సాహం ఇస్తుంది. ఓటమి కుంగదీస్తుంది.
ఆఖరికి కడపలో కూడా గెలిచాం. ఒక దెబ్బకి జగన్ మీటింగ్ పెట్టాడు. ఇంతకు ముందు
ఎమ్మెల్యేలను బానిసలుగా చూశాడు. ఎవరినీ తీయనని ఎమ్మెల్యేలను బతిమాలుతున్నాడు.
దేవుడు స్క్రిప్ట్ తిరగరాశాడు. దేవుడు జగన్‌కి డేంజర్ బెల్ కొట్టాడు. మేం
తలచుకుంటే తాడేపల్లి ప్యాలెస్ కూల్చడం ఎంత సేపు. నాకు ఇష్టమైన నగరం విశాఖ.
ఇక్కడ నాకు ఇల్లు లేదు. నేను భూములు ఆక్రమించను, భూ అక్రమాలు జరగనివ్వను. నా
జీవితాంతం ఉత్తరాంధ్ర, విశాఖ వాసులకు రుణపడి ఉంటా. విశాఖలో ప్రభుత్వ భూముల
ఆక్రమణలపై సిట్ విచారణ జరిపిస్తాం. ప్రశాంతమైన విశాఖలో గంజాయి, గన్ కల్చర్
తీసుకొచ్చారు. రైతు బజార్లు తాకట్టు పెట్టిన వ్యక్తి జగన్. విశాఖ ఉక్కు కూడా
అమ్మేస్తున్నారు. దేశంలోనే రిచెస్ట్ సీఎం జగన్’’ అని చంద్రబాబు అన్నారు.
చంద్రబాబును కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ నేతలు : తెలుగుదేశం పార్టీ
జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును విశాఖ ఎయిర్ పోర్టులో ఉక్కు పరిరక్షణ కమిటీ
నేతలు కలిసారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్
పరిరక్షణ కోసం ప్రతిపక్ష నేత చంద్రబాబుకు వినతిపత్రం ఇచ్చామన్నారు. ప్లాంట్‌ను
కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని చంద్రబాబు చెప్పారన్నారు. కానీ
జగన్ సర్కారు పూర్తిగా విఫలం అయిందని, ఈ సమస్యను ఢిల్లీ వరకు తీసుకెళ్తానని
చెప్పారన్నారు. గత కొన్ని ఏళ్లుగా కార్మికులు ఆందోళన చేస్తున్నా కేంద్రం, జగన్
సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు. అందుకే చంద్రబాబుని కలిశామని చెప్పారు.
కార్మిక సంఘాల నేతలను ఢిల్లీకి తీసుకు వెళతామని చెప్పి వైసీపీ నేతలు మాట
తప్పారని, కనీసం అఖిల పక్షం నేతలనైనా సీఎం జగన్ ఢిల్లీకి తీసుకువెళ్ళాలని,
ప్రైవేటీకరణను ఆపాలని, లేదంటే ప్రజలు విశ్వసించరని కమిటీ నేతలు పేర్కొన్నారు.