10 సార్లు ఒకే నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఘనత బాబు జగ్జీవన్ రామ్ కే సొంతం
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతి వేడుకలు
సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున
విజయవాడ : బడుగు, బలహీన వర్గాలకు దిక్సూచి, దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో
లిఖించదగిన వ్యక్తి భారతదేశ మాజీ ఉప ప్రధాని, సమతావాది బాబు జగ్జీవన్ రామ్
అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. బాబు జగ్జీవన్ రామ్
115వ జయంతి మహోత్సవాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ
ఆధ్వర్యంలో బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అత్యంత వేడుకగా
నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి ముఖ్య
అతిథులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ
మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ చిన్ననాటి నుంచే అనేక ఒడిదుడుకులు
అధిగమించి భారత రాజకీయాలను ఒంటిచేత్తో నడిపించిన దార్శనికుడు శ్రీ బాబు
జగ్జీవన్ రామ్ అని కొనియాడారు.
కేంద్ర మంత్రి పదవులను సమర్థవంతంగా నిర్వహించటమే కాకుండా ఆయా శాఖామాత్యులుగా
ఉన్న సమయంలో విప్లవాత్మక చర్యలకు నాంది పలికి తనదైన ముద్ర వేశాడని
గుర్తుచేసుకున్నారు. పేదలకు చదువు విలువ చెప్పి వారికి చదువు ఎంత ముఖ్యమో
అవగాహన కల్పించడంలో ప్రముఖ పాత్ర వహించిన ఘనత బాబు జగ్జీవన్ రామ్ కే
దక్కుతుందన్నారు. నేటి తరం బాబు జగ్జీవన్ రామ్ ను స్పూర్తిగా తీసుకుని
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. డాక్టర్ బి. ఆర్.
అంబేడ్కర్, పూలే, జగ్జీవన్ రామ్ తదితరుల ఆశయాల ఆలోచనా విధానాన్ని
అందిపుచ్చుకుని జగనన్న ప్రభుత్వం రాష్ట్రంలో పేదలు, బడుగు, బలహీన వర్గాల
అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి సమర్థవంతంగా అమలు
చేస్తుందని కొనియాడారు. కడుపులో బిడ్డ నుంచి అవ్వల వరకు ప్రతి ఒక్కరికీ
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు నేరుగా అందే విధంగా చర్యలు
తీసుకోవటం శుభపరిణామన్నారు.
సభకు అధ్యక్షత వహించిన విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు శ్రీ.మల్లాది
విష్ణువర్ధన్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ దేశ యువతకు స్పూర్తి ప్రదాత అని
ఆయన జీవిత చరిత్రను నేటి యువత తెలసుకోవాలని కోరారు. దేశంలో నాడు నెలకొన్న
వివక్షపై పోరాడిన యోధుడని కొనియాడారు. అన్ని వర్గాలను సంఘటిత పరిచిన గొప్ప
దార్శనికుడన్నారు. రాష్ట్ర క్యాబినెట్ లో సామాజిక న్యాయం పాటిస్తూ ముఖ్యమంత్రి
జగన్ మోహన్ రెడ్డి దేశానికే ఆదర్శంగా నిలిచాడన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో సబ్
ప్లాన్ కు రూ. 20వేల కోట్లు కేటాయించటం సంతోషకరమైన విషయమన్నారు.
బాపట్ల లోక్‌సభ సభ్యులు శ్రీ. నందిగం సురేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ
చదువుకోవాలి, ఆర్థిక భద్రత పెంచుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి
వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోని అన్ని
రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. ఆర్థికంగా ఇబ్బంది లేకుంటే
పేద విద్యార్థుల చదువులకు ఆటంకం ఉండదని వివరించారు. వచ్చే ఎన్నికల్లో జగనన్న
ప్రభుత్వం అత్యధిక మెజార్టీతో గెలుపొందటంతో పాటు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు
చేయటం ఖాయమన్నారు.
శాసనమండలి సభ్యులు డాక్టర్. మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ స్వాతంత్ర
సమరంలో పాల్గొంటూ కులవివక్షను ఎదుర్కొంటూ, సమానత్వంపై పోరాడుతూ 50 సంవత్సరాలు
పార్లమెంటేరియన్‌గా, 33 సంవత్సరాలు కేంద్ర మంత్రివర్యులుగా కొనసాగటం సాధారణ
మానవులకు సాధ్యం కాదని కాని శ్రీ బాబు జగ్జీవన్ రామ్ అన్ని సమస్యలను
సమర్థవంతంగా ఎదుర్కొని విజేతగా నిలిచాడన్నారు. కేంద్ర మంత్రిగా నాటి
రోజుల్లోనే విప్లవాత్మక నిర్ణయాలను అమలు చేశారని, టెలిఫోన్ అంటే తెలియని
రోజుల్లోనే జిల్లాకు ఒక టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఏర్పాటు చేశాడని గుర్తుచేశారు.
ప్రధాని అయ్యే ఛాన్స్ రెండు సార్లు వచ్చిందని అదీ బాబు జగ్జీవన్ రామ్
గొప్పతనమన్నారు.
విజయవాడ (పశ్చిమ) శాసనసభ్యులు శ్రీ. వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ
అంటరాని తనంపై ఎక్కుపెట్టిన కత్తి చివరి వరకు దించలేదని, అంతటి మహనీయుని జయంతి
దేశ వ్యాప్తంగా జరుపుకోవటం సంతోషకరమన్నారు. మహోన్నత నాయకుల ఆలోచనలను అమలు
చేస్తున్న ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని కొనియాడారు. ఒకే నియోజకవర్గం
నుంచి 10 సార్లు ఎన్నికైన ఏకైక రాజకీయ నాయకుడు బాబు జగ్జీవన్ రాం అన్నారు.
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మీ
మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు, దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన శ్రీ బాబు
జగ్జీవన్ రామ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. దేశ నాయకులు
సేవలను ఎన్నడూ మరవకూడదని, వారిని స్పూర్తిగా తీసుకుని ముందుకు సాగితే ఉత్తమ
సమాజ నిర్మాణం సాధ్యమన్నారు.
కార్యక్రమంలో ఎ.పి. మాల వెల్ఫేర్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్
కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్ పర్సన్ శ్రీమతి పెదపాటి అమ్మాజి, ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ ఛైర్మన్ శ్రీ డాక్టర్. పి. గౌతమ్ రెడ్డి,
ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీయల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ శ్రీమతి
బండి శివశక్తి పుణ్యశీల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు సంక్షేమ మరియు అభివృద్ధి
సంస్థ ఛైర్మన్ శ్రీ. అడపా శేషగిరి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్ పర్సన్ శ్రీమతి
టి. జమల పూర్ణమ్మ, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీమతి
అవుతు శ్రీశైలజా రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి జి.
జయలక్ష్మీ, సాంఘిక సంక్షేమ శాఖ డైరక్టర్ కె. హర్షవర్ధన్, ఎన్టీఆర్ జిల్లా
కలెక్టర్ యస్. ఢిల్లీరావు, విజయవాడ మున్సిపల్ కమిషనర్ శ్రీ. స్వప్నిల్ దినకర్
పుండ్కర్, ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి శ్రీవాస్ నుపూర్ అజయ్
కుమార్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా కస్తూర్భా గాంధీ విద్యాలయ విద్యార్థినీలు పలు
దేశభక్తి గీతాలను ఆలపించి వీక్షకులను అలరించారు. కార్యక్రమంలో వివిధ దళిత సంఘ
నాయకులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.