63 వ డివిజన్ 278 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ : కుల, మత, ప్రాంత, వర్గాలకతీతంగా లంచం, సిఫారసు లేకుండా అన్ని వర్గాల
వారికి చేయూతను అందించిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని
ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు.
63 వ డివిజన్ 278 వ వార్డు సచివాలయ పరిధిలో నిర్వహించిన గడప గడపకు మన
ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మతో కలిసి ఆయన
పాల్గొన్నారు. పాత రాజీవ్ నగర్లో విస్తృతంగా పర్యటించి.. 272 గడపలను
సందర్శించారు. ఈ సందర్భంగా మూడున్నరేళ్లలో ప్రభుత్వం చేసిన మంచితో పాటు
ముఖ్యమంత్రి రాసిన లేఖను లబ్ధిదారులకు వివరించారు. గత చంద్రబాబు ప్రభుత్వం
ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమై ప్రజలను తీవ్ర ఇబ్బందులకు
గురిచేసిందన్నారు. కానీ సీఎం వైఎస్ జగన్ మూడున్నరేళ్ల కాలంలో 99శాతం హామీలు
అమలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి అర్జీలు, సూచనలు
స్వీకరించి.. పరిష్కారానికి అధికారులకు సూచనలు చేశారు. అనంతరం స్థానిక నగరపాలక
సంస్థ ఉన్నత పాఠశాలను సందర్శించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఆయన..
మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఆదేశించారు.
ప్రభుత్వంపై ఎల్లో మీడియా విషప్రచారం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన వర్క్ షాప్ కు
పచ్చమీడియా విపరీత అర్థాలు, వక్రభాష్యాలు చెబుతోందని మల్లాది విష్ణు
మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని రాష్ట్రంలోని 1.60 కోట్ల కుటుంబాలకు
వివరించాలని, ప్రతి తలుపు తట్టి సంక్షేమ పాలన గురించి వివరించాలని సీఎం
సూచించారన్నారు. పాలనాపరంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు అన్ని సామాజిక
వర్గాలు, ప్రాంతాల ప్రజల నుంచి పెద్దఎత్తున మద్ధతు లభిస్తున్నట్లు
వెల్లడించారు. కానీ జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై పచ్చమీడియా విషం చిమ్ముతోందని
ధ్వజమెత్తారు. పరిపాలన వికేంద్రీకరణ తమ ప్రభుత్వ విధానమని ఈ సందర్భంగా
పునరుద్ఘాటించారు. ఇందులో భాగంగా గ్రామ/వార్డు సచివాలయాలు, జిల్లాల పునర్
వ్యవస్థీకరణ, మూడు రాజధానుల నినాదంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. దీని
ద్వారా మూడు స్థాయిలలోనూ పాలన సులభతరం అవుతుందని తెలియజేశారు. మరోవైపు
శాసనసభ్యునిగా గెలవలేకపోయాయనే అక్కసుతో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలపై నారా
లోకేష్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మల్లాది విష్ణు మండిపడ్డారు. పేదల
కడుపునింపే అన్నాక్యాంటీన్లలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన హీన చరిత్ర
తెలుగుదేశానిదని విమర్శించారు. కానీ డీబీటీ ద్వారా అక్షరాలా రూ.2 లక్షల కోట్ల
నగదును లబ్ధిదారుల ఖాతాలలో నేరుగా జమ చేసిన ఘనత జగనన్న ప్రభుత్వానికే
దక్కుతుందని మల్లాది విష్ణు అన్నారు. సెంట్రల్లోనే రూ. 320 కోట్ల సంక్షేమాన్ని
అక్కచెల్లెమ్మలకు అందించినట్లు వివరించారు. తమ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు
వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకునేందుకు రాష్ట్ర
ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. కార్యక్రమంలో డీఈ రామకృష్ణ, ఏఈ అరుణ్
కుమార్, సీడీఓ జగదీశ్వరి, డివిజన్ కోఆర్డినేటర్ పసుపులేటి యేసు, నాయకులు
సీహెచ్ రవి, మోదుగుల గణేష్, టెక్యం కృష్ణ, తిరుపతిరావు, ఎం.గోపి, రాము,
కమలేష్, ఆర్.యేసు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.