విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టే ఏ పథకమైనా
అక్కచెల్లెమ్మలను ఉన్నతస్థాయిలో కూర్చోబెట్టే దిశగా రూపకల్పన చేసినట్లు
ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు.
ఎల్బీఎస్ నగర్లో జరిగిన వైఎస్సార్ ఆసరా మూడో విడత సంబరాలలో స్థానిక
కార్పొరేటర్ అలంపూరు విజయలక్ష్మితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ
సందర్భంగా సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ చిత్రపటానికి పాలాభిషేకం
నిర్వహించారు. అక్కచెల్లెమ్మల ముఖంలో చిరునవ్వు చూడాలని, ప్రతీ ఆడబిడ్డను
లక్షాధికారిని చేయాలని ఆనాడు మహానేత వైఎస్సార్ మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి
అక్కచెల్లెమ్మలను ఆదుకున్నారని మల్లాది విష్ణు పేర్కొన్నారు. తండ్రికి తగ్గ
తనయుడిగా సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చి పేదరిక
నిర్మూలనకు కృషిచేస్తున్నారన్నారు. అమ్మఒడి, విద్యాదీవెన పథకాలతో
అక్కచెల్లెమ్మల పిల్లలను చదివిస్తున్నారని తెలిపారు. మహిళా సాధికారత కోసం అనేక
పథకాలను అమలు పరుస్తూ వారంతా ఆర్థిక స్థిరత్వం సాధించేందుకు అవసరమైన అన్ని
మార్గాలను జగనన్న అన్వేషిస్తున్నారన్నారు. వారి జీవితాలను ఉన్నత స్థాయికి
తీసుకెళ్లేందుకు ప్రభుత్వ పరంగా ఎంతవరకు సహాయసహకారాలు అందించాలో అన్నీ
చేస్తున్నారని కొనియాడారు. మేనిఫెస్టోలో పొందిపర్చినప్పటికీ అగ్రవర్ణాల్లోనే
పేదలకు మంచి జరగాలనే సంకల్పంతో వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకానికి శ్రీకారం
చుట్టారన్నారు. జగనన్న కాలనీల ద్వారా అక్షరాల 32 లక్షల మందికి ఆడపడుచులకు ఇళ్ల
పట్టాలు అందించినట్లు వివరించారు. గత ప్రభుత్వం డబ్బులు కడతామని డ్వాక్రా
సంఘాల అక్కచెల్లెమ్మలను మోసం చేసి అప్పుల ఊబిలోకి నెట్టేసిన పరిస్థితుల్లో
18.36 శాతం నాన్ పర్ఫామింగ్ అసెట్స్, అవుట్ స్టాండింగ్ లోన్స్ కింద
వారంతా ఏ గ్రేడ్ నుంచి సీ, డీ గ్రేడ్ లోకి పడిపోయాయని గుర్తుచేశారు.
వారందరినీ వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా అప్పుల ఊబిలోనుంచి బయటకు
తీసుకురావాలన్నదే సీఎం వైఎస్ జగన్ ఆలోచన అని తెలిపారు. అంతేకాకుండా చంద్రబాబు
రద్దు చేసిన సున్నా వడ్డీని మళ్లీ పునరుద్ధరించి.. వైఎస్సార్ సున్నావడ్డీ పథకం
పేరుతో సకాలంలో రుణాలు చెల్లించిన స్వయం సహాయక సంఘాలకు రూ. 3,615 కోట్లు జమ
చేశామన్నారు. అక్కచెల్లెమ్మలకు ఆర్థిక చేయూతనందిచడమే కాకుండా జీవనోపాధి
మార్గాలను సైతం చూపిస్తూ మహిళలు ఎక్కడ నష్టపోకూడదనే తపన, తాపత్రయంతో ఈ
ప్రభుత్వం పనిచేస్తున్నట్లు వివరించారు. 62 డివిజన్ కు సంబంధించి మూడవ విడత
ఆసరా ద్వారా 299 గ్రూపులలోని 2,963 మంది అక్కచెల్లెమ్మల ఖాతాలలో రూ. 2 కోట్ల
75 లక్షల 60 వేల 295 రూపాయల నిధులు జమ చేసినట్లు మల్లాది విష్ణు తెలిపారు. ఇంత
పెద్దఎత్తున లబ్ధి చేకూరిన డివిజన్ నియోజకవర్గంలో 62 వ డివిజన్ అని
తెలియజేశారు. సుస్థిర జీవనోపాధి మార్గాల ద్వారా విజయవంతం అయిన మహిళల ద్వారా
ఇతర మహిళలు స్ఫూర్తి పొందాలని సూచించారు. కార్యక్రమంలో సీడీఓ జగదీశ్వరి,
కోఆప్షన్ సభ్యులు నందెపు జగదీష్, నాయకులు అలంపూరు విజయ్, వీరబాబు, రామిరెడ్డి,
హైమావతి, బోరా బుజ్జి, మస్తాన్, వెంకట్, బ్రహ్మేంద్ర, శివపార్వతి, సుభాన్,
యోహాన్, పొదుపు సంఘాల మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.