బ్యాటర్లతోపాటు బౌలర్లూ కష్టపడాలి.. సిరీస్ పట్టేయాలి! <
వన్డే ప్రపంచ కప్ సన్నాహకంలో భాగంగా భారత్‌కు ప్రతి సిరీస్ కీలకమే. ఈ క్రమంలో
న్యూజిలాండ్‌తో సిరీస్‌ను నెగ్గేందుకు టీమ్ఇండియాకు చక్కటి అవకాశం. ఇప్పటికే
తొలి వన్డే గెలిచి ఉత్సాహంతో భారత్.. రాయ్‌పుర్ వేదికగా రెండో వన్డేకు
సిద్ధమైంది.
తొలి వన్డేలో డబుల్ సెంచరీ.. భారీ స్కోరు సాధించడం.. చివరికి విజయం.. ఈ మూడు
మాత్రమే న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ చెప్పదగ్గ
విషయాలు. ఎందుకంటే బ్యాటింగ్‌లో ఆ ఒక్కడు.. బౌలింగ్‌లోనూ ఇద్దరు రాణించడంతో
350 పరుగుల లక్ష్యం ఉంచినా సరే కేవలం 12 పరుగుల తేడాతో టీమ్ఇండియా విజయం
సాధించింది. ఈ క్రమంలో రెండో వన్డేలో తీవ్ర పోరాటం తప్పదు. ఓడిన కసితో ఉన్న
కివీస్‌ను ఏమాత్రం తక్కువ అంచనా వేసినా ప్రమాదకరమే. బ్యాటింగ్, బౌలింగ్
విభాగాల్లో మెరుగుపర్చుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి.
టాప్ 208.. ఆ తర్వాత 34
భారత ఇన్నింగ్స్‌లో 208 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్ ద్విశతకం పూర్తి
చేశాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం మరొకటి ఉంది. గిల్ తర్వాత అత్యధిక
స్కోరు రోహిత్ శర్మ (34). శ్రీలంకపై సెంచరీలు బాదిన విరాట్ కోహ్లీ ఈసారి గతి
తప్పాడు. బంగ్లాదేశ్‌పై డబుల్ సెంచరీ చేసినా లంకతో సిరీస్‌కు ఇషాన్ పక్కన
పెట్టడంపై సోషల్ మీడియాలో విమర్శలు తెగ వచ్చేశాయి. దీంతో ఎలాగూ కేఎల్
రాహుల్ లేకపోవడంతో ఇషాన్‌కు అవకాశం ఇచ్చాడు రోహిత్.. అయితే నాలుగో స్థానంలో
వచ్చిన ఇషాన్ సద్వినియోగం చేసుకోలేదు. ఇక రెండో మ్యాచ్‌లో కూడా ఇలాగే ఆడితే
మాత్రం రిజర్వ్ బెంచ్ మీద ఉన్న శ్రీకర్ భరత్‌కు అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది.
ఇదే జరిగితే వన్డే ప్రపంచకప్‌లో ఆడాలనే కల ఇషాన్‌కు కలగానే మిగిలిపోయే ప్రమాదం
ఉంది.
సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య కాస్త ఫర్వాలేదనిపించినా.. వారి
స్థాయికి మాత్రం తక్కువే. ఓ వైపు కుర్రాడు విజృంభించి ఆడుతున్న సమయంలో అతడికి
చేదోడుగా ఉండాల్సిన బాధ్యత సీనియర్లు అయిన వీరిపై ఉంటుంది. ఇప్పుడివన్నీ ఆసియా
కప్‌తోపాటు వన్డే ప్రపంచకప్‌నకు రిహార్సల్‌గా భావించాలి. ఇక రవీంద్ర జడేజా,
అక్షర్ పటేల్ లేనప్పుడే తుది జట్టులోకి వచ్చే వాషింగ్టన్ సుందర్ అందుకు
తగ్గట్గుగా ఆడాలి. కెప్టెన్ రోహిత్ భారీ ఇన్నింగ్స్ ఇంకా బకాయిగానే ఉంది.
వన్డేల్లో అతడి విశ్వరూపం చూసి చాలా రోజులైంది.