మూడోసారి ఐదు పేర్లు సిఫార్సు
పలు హైకోర్టులకు మరో 20 పేర్లు
న్యూఢిల్లీ : న్యాయమూర్తులుగా తాము చేసిన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం పదేపదే
తిప్పి పంపజాలదని సుప్రీంకోర్టు కొలీజియం మరోసారి స్పష్టం చేసింది. పలు
హైకోర్టులకు న్యాయమూర్తులుగా ఇప్పటికే పలుమార్లు చేసిన ఐదు గత సిఫార్సులను
తాజాగా మరోసారి కేంద్రానికి పంపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్
డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్
కె.ఎం.జోసెఫ్‌తో కూడిన సుప్రీంకోర్టు కొలీజియం సమావేశమై ఈ మేరకు నిర్ణయం
తీసుకుంది. వీరిలో తాను స్వలింగ సంపర్కినని ప్రకటించుకున్న సీనియర్ అడ్వకేట్
సౌరభ్ కృపాల్ కూడా ఉన్నారు. ఆయనను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా
నియమించాలన్న 2021 నవంబర్ 11 నాటి సిఫార్సును కొలీజియం తాజాగా
పునరుద్ఘాటించింది. న్యాయవాదులు ఆర్.జాన్ సత్యంను మద్రాస్ హైకోర్టు
న్యాయమూర్తిగా, సోమశేఖర్ సుందరేశన్‌ను బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా తిరిగి
సిఫార్సు చేసింది. వీరితో పాటు అమితేశ్ బెనర్జీ, సఖ్య సేన్‌ను కలకత్తా
హైకోర్టు న్యాయమూర్తులుగా వెంటనే నియమించాలని కూడా పేర్కొంది.
అలాగే కర్నాటక, అలహాబాద్, మద్రాస్ హైకోర్టులకు న్యాయమూర్తులుగా మరో 20
పేర్లను సిఫార్సు చేసింది. వీరిలో 17 మంది న్యాయవాదులు, ముగ్గు్గరు
జడ్జిలున్నారు. ఈ సందర్భంగా కేంద్రాన్ని ఉద్దేశించి కొలీజియం పలు కీలక
వ్యాఖ్యలు చేసింది. తమ సిఫార్సులను కేంద్రం పదేపదే తిప్పి పంపడాన్ని
అనుమతించలేమని స్పష్టం చేసింది. అమితేశ్, సేన్ పేర్లను కేంద్రం ఇప్పటికే
రెండేసిసార్లు తిప్పి పంపింది. అమితేశ్ తండ్రి జస్టిస్ యు.సి.బెనర్జీ
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి. గోధ్రాలో సబర్మతి రైలు ప్రమాదం వెనక కుట్ర
కోణమేదీ లేదని తేల్చిన కమిషన్‌కు సారథి. ఇక సత్యం ప్రధాని నరేంద్ర మోడీపై
విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారని, ప్రభుత్వ విధానాలు, పథకాలపై సుందరేశన్
ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారని వారి పేర్లను
కేంద్రం తిప్పి పంపింది. ఈ అభ్యంతరాలను కొలీజియం తాజాగా తోసిపుచ్చింది.
స్వేచ్ఛగా అభిప్రాయాలను వ్యక్తీకరించడం రాజ్యాంగపరమైన పదవులు చేపట్టేందుకు
అడ్డంకి కాబోదని స్పష్టం చేసింది.