చైనా ప్రతిసారి కొత్తరకం సమస్యను సృష్టిస్తూ ఉంటుంది. ఎల్లప్పుడూ చైనా- భారత్
సరిహద్దులో ఏదో ఒక చిచ్చు పెట్టాలనే ప్రయత్నాలు చేస్తుంటుంది. ఈ సారి
అరుణాచల్ ప్రదేశ్ వద్ద భారీ ప్రాజెక్టు నిర్మించనుందని సమాచారం. దీంతో భారత్
అప్రమత్తమైంది. ఇరు దేశాల సరిహద్దులో అరుణాచల్ ప్రదేశ్ వద్ద చైనా భారీ
ప్రాజెక్టు నిర్మించనుందనే సమాచారంతో భారత్ అప్రమత్తమైంది. పై నుంచి
ఉన్నపళంగా వచ్చే వరదను అడ్డుకోడానికి ఓ ప్రాజెక్టు నిర్మాణం ప్రతిపాదనను
ముందుకు తెచ్చింది. బ్రహ్మపుత్ర నదీజలాలను ఆయుధంగా వాడుకొని అస్సాం, అరుణాచల్
ప్రదేశ్లపై ఎక్కుపెట్టేలా చైనా పన్నిన వ్యూహానికి ఇది భారత్ విరుగుడుగా
చెప్పవచ్చు. ఇప్పటికే భారత ఈశాన్య ప్రాంతంలోకి టిబెట్ తదితర ప్రాంతాల నుంచి
ప్రవహించే నదులపై బీజింగ్ ఆనకట్టలు కట్టింది. దీంతో కీలక సమయాల్లో వీటి నుంచి
హఠాత్తుగా నీటిని విడుదల చేస్తే దిగువ ప్రాంతాలకు వరద ముప్పు తప్పదు. వీటికి
తోడు తాజాగా అరుణాచల్ ప్రదేశ్కు అత్యంత సమీపంలోని ‘మెడాగ్’ వద్ద దాదాపు
60,000 మెగావాట్ల జలవిద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఉన్న భారీ డ్యామ్
నిర్మాణానికి చైనా ప్రణాళికలు మొదలుపెట్టింది. దీంతో భారత్ అప్రమత్తమై
రానున్న ముప్పును ఎదుర్కోడానికి సిద్ధమైంది. ఈ మేరకు అరుణాచల్ ప్రదేశ్లోని
ఎగువ సియాంగ్ జిల్లాలో భారీ హైడ్రోపవర్ ప్రాజెక్టును నిర్మించాలనే
ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. 11 వేల మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసేలా
దీనిని తీర్చిదిద్దనున్నారు. ఇది మన దేశంలో ఇప్పటికే ఉన్న అతిపెద్ద హైడ్రో
ప్రాజెక్టు కంటే అయిదు రెట్లు పెద్దది. దీని ‘ప్రీ ఫీజబిలిటీ’ నివేదికను
ఇప్పటికే నేషనల్ హైడ్రోపవర్ కార్పొరేషన్ సిద్ధం చేసింది.