అందాల పోటీ అంటేనే గుర్తొచ్చేది వారు ధరించే దుస్తులు. జాతీయ, అంతర్జాతీయ
స్థాయిలో జరిగే ఈ బ్యూటీ కాంటెస్ట్‌లో మోడల్స్ రకరకాల దుస్తులు ధరిస్తుంటారు.
ఈ పోటీల్లో పాల్గొనే యువతులు అందం, ప్రతిభ ఎంత ముఖ్యమో వస్త్రధారణ కూడా అంతే
ముఖ్యం. జడ్జిలతోపాటు యావత్ ప్రపంచాన్ని ఆకర్షించేలా వీరి వస్త్రధారణ
ఉంటుంది. కళ్లు చెదిరే డ్రెస్‌లతో సాక్షాత్తు దేవకన్యే దిగివచ్చిందా? అనేలా
క్యాట్ చేస్తూ మైమరిపిస్తుంటారు. మిస్ యూనివర్స్ 2022 పోటీలు తాజాగా
న్యూజెర్సీలో జరిగాయి. ఈ పోటీల్లో థాయ్‌లాండ్ తరపున పోటీలో నిలిచిన
అన్నాసుయాంగమ్-ఐయామ్ పేరు ఇప్పుడు మారుమోగుతోంది. ఇటీవల జరిగిన ప్రాథమిక
పోటీలో ఆమె ధరించిన వెరైటీ గౌను అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆమె
కాస్టూమ్ గురించి ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. టైటిల్ గెలవకుండానే
అందరి దృష్టిని ఆకర్షించిన అన్నా గౌను అంత పాపులర్ కావడం వెనక ఓ బాధాకరమైన
గతం ఉంది.
వాడిపడేసిన కోక్ డబ్బా మూతలతో : చూడటానికి ఎంతో అద్భుతంగా కనిపించిన ఈ గౌను
వాస్తవానికి వాడిపడేసిన డ్రింక్ డబ్బాల మూతలతో తయారు చేశారు. మిస్
యూనివర్స్ థాయ్‌లాండ్ ఇన్‌స్ట్రాగ్రామ్ పేజ్‌లో అన్నా గౌనుకి సంబంధించిన
వివరాలను షేర్ చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రఖ్యాత థాయ్ డిజైనర్ అరిఫ్ జహవాంగ్ ఈ డ్రెస్సును రూపొందించాడు. అన్నా తన
బాల్యం, గత జీవితాన్ని ప్రపంచానికి తెలియజేసేలా ఈ డ్రెస్సును తయారు చేయించింది
ఈ క్రమంలో ఉపయోగించిన డ్రింక్ క్యాన్స్ మూతలతో (రిసైకిల్ వ్యర్థాలతో)
దీనిని తీర్చిదిద్దేలా జాగ్రత్త పడింది. లుక్ కోసం ఆ మూతల మధ్యలో
స్వరోవ్స్కీ డైమండ్స్ వచ్చేలా రెడీ చేసుకుంది. ఈ గౌనుతోనే అన్నా ప్రాథమిక
పోటీల్లో పాల్గొంది.
బాల్యమంతా చెత్తలోనే : కాగా థాయ్‌లాండ్‌కు చెందిన అన్నా తండ్రి చెత్త
సేకరిస్తూ, తల్లి వీదుల్లో చెత్త ఊడుస్తూ జీవనం సాగిస్తుంటారు. దీంతో ఆమె
బాల్యమంతా చెత్తకుప్పలు, వాడి పడేసిన వస్తువుల మధ్యే సాగింది. తల్లిదండ్రులు
పని నిమిత్తం బయటే ఎక్కువ గడపడంతో అన్నా తన నానన్మ దగ్గరే పెరిగింది.
తల్లిదండ్రులు తమ స్తోమతకు మించి కూతుర్ని చదివించారు. అందుకు తగ్గట్టే అన్నా
కష్టపడి చదివి డిగ్రీలో గోల్డ్ మెడల్ సాధించింది. చదువుకునే రోజుల్లో కొందరు
ఆమెను గార్బెజ్ బ్యూటీ క్వీన్‌గా ఎగతాళి చేసేవారు. అయినా అన్నా అవన్నీ
పట్టించుకునేది కాదు. ఓవైపు చదువులో రాణిస్తూ మరోవైపు అందాల పోటీల్లో
పాల్గొనేది. అలా మిస్ థాయ్‌లాండ్ 2020’ పోటీల్లో పాల్గొని ‘టాప్ 16’లో చోటు
సంపాదించుకుంది. ఆ తర్వాత జరిగిన ‘మిస్ యూనివర్స్ థాయ్‌లాండ్ 2022’
పోటీల్లో టైటిల్ సంపాదించి తన కలను సాకారం చేసుకుంది. తనను విమర్శించిన
నోళ్లను మూయిస్తూ అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. గతం ఎలా ఉన్నా కృషి
పట్టుదల, నమ్మకంతో గొప్ప విజయాలను సాధించవచ్చని నిరూపించింది.