లండన్ : ద్రవ్యోల్బణం, వైద్య సేవల్లో సంక్షోభం, జీతాలు పెంచాలని సిబ్బంది
సమ్మె దిగడం వంటి పలు సమస్యలు బ్రిటన్ అధికార కన్జర్వేటివ్ పార్టీని
చుట్టుముట్టాయి. ఈ క్రమంలో కొత్త సంవత్సరంలో ఆ దేశ ప్రధాని రిషి సునాక్ మొదటి
ప్రసంగం చేయనున్నారు. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపడానికే ప్రాధాన్యం
ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రసంగానికి సంబంధించిన కొన్ని వివరాలు
బయటకొచ్చాయి. ‘ఇది నా అనుభవపూర్వకంగా గ్రహించాను. జీవితంలో నేను పొందిన ప్రతి
అవకాశం విద్య వల్లనే లభించింది. అందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను. ప్రతి
చిన్నారికి అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనే ఉద్దేశంతోనే నేను
రాజకీయాల్లోకి వచ్చాను. సరైన ప్రణాళికతో దీనిని అందించాలనుకుంటున్నాను.
ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా వ్యవస్థలతో మనం పోటీ పడలేకపోవడానికి నాకు కారణం
కనిపించడం లేదు. ప్రస్తుతం 16 నుంచి 19 ఏళ్ల మధ్య వయసులో ఉన్న సగం మంది యువత
గణితాన్ని పాఠ్యాంశంగా ఎంచుకోవడం లేదు. మన పిల్లలకు ఇంతకుముందుతో పోలిస్తే..
భవిష్యత్తులో ఉద్యోగాలకు అనలిటికల్ నైపుణ్యాల అవసరం తప్పనిసరి.
ఆ నైపుణ్యాలు లేకుండా వారిని బయటకు పంపించడం వారిని నిరాశపరచడమే అవుతుంది’ అని
మెరుగైన బ్రిటన్ను తీర్చిదిద్దడంపై సునాక్ దృష్టిపెట్టారని తెలుస్తోంది. 18
ఏళ్ల వయసు వరకు విద్యార్థులు గణితాన్ని చదవడం ఆయన తప్పనిసరి చేసే
అవకాశాలున్నట్లు సమాచారం. అలాగే దేశం పట్ల గర్వంగా ఉండాలని, ద్రవ్యోల్బణం,
ఇంధన బిల్లులు, వైద్య సేవల సంక్షోభం గురించి ఆందోళన చెందవద్దని సునాక్
పేర్కొన్నట్లు ఉంది.