న్యూఢిల్లీ : భారత్ పొరుగుదేశాలతో ఎల్లప్పుడూ సత్సంబంధాలనే కోరుకుంటుందని
రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అదే భారత్ విధానమని, రాముడు, బుద్ధుడి బోధనల
స్పూర్తి ఈ తత్వాన్ని అలవరచుకున్నట్లు తెలిపారు. దేశ సరిహద్దుల్లో
ఎదురువుతున్న సవాళ్లను ధీటుగా ఎదుర్కొనగలిగే సత్తా భారత్‌కు ఉందని కేంద్ర
రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. భారత్ యుద్ధాన్ని ఎప్పటికీ
ప్రోత్సహించదని, పొరుగు దేశాలతో సత్సంబంధాలనే కోరుకుంటుందని తెలిపారు.
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్వో) అరుణాచల్ ప్రదేశ్‌లో ఉత్తర
సియాంగ్, ఎగువ సియాంగ్ జిల్లాల మధ్య నిర్మించిన వంతెన ప్రారంభోత్సవంలో
పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత్ పొరుగుదేశాలతో ఎల్లప్పుడూ
సత్సంబంధాలనే కోరుకుంటుంది. ఈ తత్వాన్ని రాముడి నుంచి, బుద్ధుడి బోధనల
స్ఫూర్తితో అలవరుచుకుంది. ఎవరైనా భారత్‌ను రెచ్చగొట్టాలని చూస్తే వారిని
ధీటుగా సమాధానం చెప్పే సత్తా భారత్‌కు ఉంది. ప్రపంచం నేడు అనేక సంఘర్షణలను
ఎదుర్కొంటోంది. భారతదేశం ఎప్పుడూ యుద్ధానికి వ్యతిరేకం. ఇది మా విధానం’’ అని
రాజ్‌నాథ్ అన్నారు. ఇటీవల ప్రధాని మోదీ సైతం ‘ఇది యుద్ధాల యుగం కాదని రష్యా
అధ్యక్షుడు పుతిన్‌తో చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా రాజ్‌నాథ్ గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో మరో 27 వంతెనలను రాజ్‌నాథ్ వర్చువల్‌గా ప్రారంభించారు. వీటిలో
లద్ధాఖ్‌లో ఎనిమిది వంతెనలు ఉండగా జమ్మూ-కశ్మీర్లో నాలుగు, అరుణాచల్
ప్రదేశ్‌లో ఐదు, సిక్కిం, ఉత్తరాఖండ్, పంజాబ్‌లలో మూడు, రాజస్థాన్‌లో రెండు
చొప్పున ఉన్నాయి. సుమారు 724 కోట్ల వ్యయంతో మొత్తం 28 వంతెనలు నిర్మించినట్లు
తెలిపారు. వీటి నిర్మాణంతో భద్రతా బలగాలు సరిహద్దు ప్రాంతాలకు సులువుగా
చేరుకోవడంతోపాటు, స్థానికంగా సామాజిక, ఆర్థికాభివృద్ధి జరుగుతుందని అన్నారు.
బీఆర్వో సరిహద్దు ప్రాంతాల్లో 2021లో 102 ప్రాజెక్టులు, 2022లో 103
ప్రాజెక్టులు పూర్తి చేసిందని తెలిపారు. కొద్దిరోజుల క్రితం అరుణాచల్
ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ
చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇరుదేశాలకు చెందిన సైనికులకు స్వల్ప
గాయాలయ్యాయి. చైనా సైనికులు ఎల్ఏసీ సమీపంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ ఘర్షణ
నెలకొంది. ఈ నేపథ్యంలో దేశ సరిహద్దులను బలోపేతం చేయడంలో భాగంగా కేంద్ర
ప్రభుత్వం మౌలికవసతుల కల్పనకు పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా కొత్తగా
సరిహద్దుల్లో వంతెనల నిర్మాణం చేపడుతోంది.