నికోసియా : ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న దాయాది దేశం పాకిస్థాన్‌పై విదేశాంగ
మంత్రి ఎస్ జై శంకర్ విమర్శలు చేశారు. అలాగే చైనాతో సంబంధాలు సాధారణంగా
లేకపోవడానికి కారణం ఏంటో వెల్లడించారు. భారత్ ను బలవంతంగా చర్చలకు
కూర్చోబెట్టేందుకు ఉగ్రవాదాన్ని సాధనంగా ఉపయోగించలేరంటూ విదేశాంగ మంత్రి ఎస్
జైశంకర్ అన్నారు. సైప్రస్ భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతూ పాకిస్థాన్
తీరును ఎండగట్టారు. అలాగే చైనాతో సరిహద్దు వివాదం పైనా మాట్లాడారు.
‘భారత్‌ను చర్చలకు బలవంతం చేసేందుకు ఉగ్రవాదాన్ని సాధనంగా ఉపయోగించడాన్ని మేం
అనుమతించం. మేం పొరుగువారితో సత్సంబంధాలను కోరుకుంటాం. అంటే అర్థం
ఉగ్రవాదాన్ని క్షమిస్తామని కాదు. ఇక సరిహద్దుల విషయానికి వస్తే అక్కడ మనకు
సవాళ్లున్నాయి. కొవిడ్ సమయంలో ఇవి మరింత పెరిగాయి. ప్రస్తుతం చైనా తో మన
సంబంధాలు సాధారణంగా లేవని మీ అందరికీ తెలుసు. వాస్తవాధీన రేఖను ఏకపక్షంగా
మార్పులు చేసే ప్రయత్నాలను మనం అంగీకరించకపోవడమే అందుకు కారణం’ అని జాతి
భద్రత, విదేశాంగ విధానంలో భారత్ చూపుతున్న దృఢవైఖరిని ఆయన ప్రస్తావించారు.
అలాగే విదేశాల్లో ఉండే భారతీయుల గురించి మాట్లాడారు. ‘అంతర్జాతీయంగా వివిధ
దేశాల్లో ఉండే భారతీయుల గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను.
విదేశాల్లో ఉండే భారతీయులు అంటే భారతీయ కుటుంబాల్లో భాగమైన పౌరులే. మోడీ
ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి విదేశాల్లో ఉండే భారతీయులు దేశానికి గొప్ప బలం
అని చెప్పాం. ఎక్కువ మంది భారతీయలు బయటకు వెళ్లే కొద్దీ, గ్లోబల్
వర్క్‌ప్లేస్ పెరుగుతుంది. ప్రస్తుతం సుమారు 3.3 కోట్ల మంది భారతీయులు
విదేశాల్లో నివసిస్తున్నారు. వీరందరిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత
భారత్‌కు ఉంది. ఈ ఏడెనిమిది సంవత్సరాల్లో భారతీయులకు ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ
భారత ప్రభుత్వం ఉందనేది మీరు చూశారని మద్దతు ప్రకటించారు.