జీనోమ్ ల్యాబ్‌కు విదేశీ ప్రయాణికులకు నమూనాలు
కరోనా నియంత్రణపై రాష్ట్ర వైద్యశాఖ ముందు జాగ్రత్త చర్యలు
అమరావతి : చైనాతోపాటు మరికొన్ని దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే కరోనా నియంత్రణపై
రాష్ట్ర వైద్యశాఖ ముందు జాగ్రత్త చర్యలను ప్రారంభించింది. ఇదే క్రమంలో
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ప్రభుత్వాస్పత్రుల్లో మాక్ డ్రిల్
నిర్వహించాలని నిర్ణయించింది. మాక్‌డ్రిల్ నిర్వహణ, కరోనా నియంత్రణకు
చేపట్టాల్సిన చర్యలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఎంహెచ్‌వోలకు వైద్య,
ఆరోగ్యశాఖ సోమవారం ఆదేశాలు జారీచేసింది. కరోనా కేసులు పెరిగితే ఆస్పత్రుల్లో
ఉన్న సదుపాయాలు, నియంత్రణ కోసం చేయాల్సిన ఏర్పాట్లు, సన్నద్ధతపై
సమీక్షించుకోవడమే ఈ మాక్ డ్రిల్ నిర్వహణ ముఖ్య ఉద్దేశం. మాక్ డ్రిల్‌లో
భాగంగా అన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ ఆస్పత్రులు ఉన్నాయా.. లేదా.. అని
పరిశీలిస్తారు. ఆయా ఆస్పత్రుల్లో ఐసీయూ, ఆక్సిజన్, సాధారణ పడకల సామర్థ్యం,
వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ల్యాబ్‌లలో కరోనా పరీక్షల
సామర్థ్యం, ఆర్టీపీసీఆర్, ఆర్ఏటీ కిట్స్, పరీక్షల నిర్వహణకు అవసరమైన
రీఏజెంట్స్ సరిపడా అందుబాటులో ఉన్నాయా.. లేదా.. అని చూస్తారు. తప్పనిసరి
మందులు, వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు, ఎన్–95 మాస్క్‌లు, ఇతర మందులు,
సర్జికల్స్ నిల్వలను పరిశీలిస్తారు. ఆక్సిజన్ కాన్సెట్రేటర్లు,
సిలిండర్లు, పీఎస్ఏ ప్లాంట్లు, లిక్విడ్ ఆక్సిజన్ స్టోరేజ్ ట్యాంక్,
మెడికల్ గ్యాస్ పైప్‌లైన్ వ్యవస్థ గురించి తెలుసుకుంటారు. ఆక్సిజన్
నాణ్యత, పైప్‌లైన్ ఏ విధంగా ఉన్నాయనేది కూడా చూస్తారు.
జీనోమ్ ల్యాబ్‌కు విదేశీ ప్రయాణికులకు నమూనాలు : ప్రతి అంతర్జాతీయ విమానంలో
విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల్లో ర్యాండమ్‌గా రెండు శాతం మందికి కరోనా
నిర్ధారణ పరీక్షలు చేయాలని అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్న జిల్లాల
డీఎంహెచ్‌వోలకు సోమవారం వైద్యశాఖ ఆదేశాలు జారీచేసింది. ఈ పరీక్షల్లో పాజిటివ్
వచ్చిన వ్యక్తుల నమూనాలను విజయవాడలోని జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు
పంపాలని ఆదేశించింది. ర్యాండమ్ పరీక్షల నుంచి 12ఏళ్లలోపు పిల్లలను
మినహాయించింది. రాష్ట్రంలోని గన్నవరం, విశాఖపట్నం, రేణిగుంట, కర్నూల్, కడప,
రాజమహేంద్రవరం ఎయిర్ పోర్టులలో ప్రయాణికులందరికీ థర్మల్ స్క్రీనింగ్
నిర్వహించాలని ఆయా జిల్లాల డీఎంహెచ్‌వోలకు ఆదేశాలు జారీచేసింది. పాజిటివ్‌గా
నిర్ధారణ అయిన వ్యక్తులను కరోనా నిబంధనలకు అనుగుణంగా ఐసోలేషన్‌లో ఉంచాలంది.
అంతర్జాతీయ ప్రయాణాలు చేసి వచ్చిన వారికి కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే
వెంటనే దగ్గరలోని ప్రభుత్వాస్పత్రిని సంప్రదించాలని, లేదా 104కు ఫోన్ చేసి
సమాచారం ఇచ్చి సలహాలు, సూచనలు తీసుకోవాలని తెలిపింది.