ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయాయి. ఎంతగా అంటే మరిగే నీరు వెంటనే
గడ్డకట్టిపోతోందంటే అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
అగ్రరాజ్యం అమెరికా మంచు తుపానుతో గజగజలాడుతోంది. భారీగా కురుస్తున్న మంచు,
చలిగాలులకు ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠానికి పడిపోయాయి. మరోవైపు విద్యుత్
సరఫరా నిలిచిపోయి స్థానికంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. అమెరికా వ్యాప్తంగా
15లక్షలకు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు అంధకారంలో ఉండాల్సి
వచ్చింది.
అమెరికా జాతీయ వాతావరణ సేవల వివరాల ప్రకారం.. శుక్రవారం ఉష్ణోగ్రతలు -48
డిగ్రీలకు పడిపోయాయి. అమెరికా వ్యాప్తంగా 20కోట్ల మందికి పైగా ప్రజలు మంచు
తుపాను ముప్పు కింద ఉన్నారు. హైవేలపై మంచు భారీగా పేరుకుపోవడంతో వాటిని
మూసివేశారు. దీంతో ప్రజలు క్రిస్మస్ ప్రయాణాలను వాయిదా వేయాల్సిన పరిస్థితి
నెలకొంది. అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే.. మరగబెట్టిన నీరు వెంటనే
గడ్డకట్టేస్తుందని స్థానికులు చెబుతున్నారు. అటు విద్యుత్ సరఫరా లేక, బయటకు
వెళ్లలేక తాము ఇబ్బందులు పడుతున్నామని న్యూయార్క్‌కు చెందిన ఓ మహిళ తెలిపారు.
శుక్రవారం ఒక్కరోజే 5వేల విమానాలు రద్దయ్యాయి. మరో 7600 విమానాలు ఆలస్యంగా
నడిచాయి. ఒహైయోలో మంచు తుపాను కారణంగా 50 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ
ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. మిచిగాన్‌లోనూ 9 ట్రాక్టర్లు ఢీకొని
ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. మంచు ప్రభావం ఎక్కువగా ఉందని, అత్యవసరమైతే తప్ప
బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు ‘బాంబు
సైక్లోన్’ గా బలపడే ప్రమాదం ఉందని అక్యూవెదర్ సంస్థ తెలిపింది. ఈ క్రమంలోనే
న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ఇ, తర ప్రాంతాల గవర్నర్లతో కలిసి స్థానికంగా
‘అత్యవసర పరిస్థితి’ని ప్రకటించారు.