క్షయవ్యాధి, విస్తృతంగా పెరుగుతున్నందున టీబీ రోగులకు ఔషధం, పోషకాహారం, సమాజం
నుంచి మద్దతు విషయంలో అదనపు జాగ్రత్తలు అవసరం. ప్రాణాలు తీసే క్షయ వ్యాధి
మైకోబ్యాక్టీరియమ్ టూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల సోకుతోందని 1882,
మార్చి 24న జర్మనీ శాస్త్రవేత్త రాబర్ట్ కుచ్ తెలుసుకున్నాడు. దాని నివారణ
కోసం ప్రయత్నించాడు. 1905లో ఆయన్ను నోబెల్ బహుమతి వరించింది.
భారత్ లో ఇలా…
దురదృష్టమేంటంటే ప్రపంచంలోనే క్షయ(TB) వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నది
భారత్‌లోనే. వ్యాధి గురించి సరిగా తెలియకపోవడం, దాన్ని నిర్లక్ష్యం
చేస్తుండటంతో… దేశంలో ప్రతి సెకనుకు ఒకరికి టీబీ వ్యాధి వస్తోంది. రోజూ
దేశంలో 1000 మంది క్షయ వ్యాధితో చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ
తెలిపింది. 2016లో PlOS జర్నల్‌లో ప్రచురించబడిన ఈ అధ్యయనం ప్రకారం 2013లో
ప్రభుత్వ ఆరోగ్య సౌకర్యాల వద్ద 19,38,027 మంది టీబీ రోగులు ఉన్నట్లు లెక్కలు
చెబుతున్నాయి. కేవలం 1,049,237 (39%) మంది మాత్రమే సమర్థవంతంగా చికిత్స
పొందారు. అంటే చికిత్స తర్వాత ఒక సంవత్సరం పాటు వారికి టీబీ పునరావృతం కాలేదు.
ప్రపంచంలోని ప్రతి నలుగురు టీబీ రోగుల్లో ఒకరు భారతదేశం నుంచే వున్నారు.
భారతదేశంలో క్షయవ్యాధి అత్యధిక భారాన్ని కలిగి ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ
(WHO) అంచనాల ప్రకారం భారతదేశంలో దాదాపు ఒక మిలియన్ గుర్తించని టీబీ రోగులు
ఉన్నారు. వారు జాతీయ టీబీ ప్రోగ్రామ్‌కు కూడా నివేదించబడలేదు. రోగి సంరక్షణను
మెరుగుపరచడానికి స్మెర్-నెగటివ్ టీబీ, మల్టీ-డ్రగ్-రెసిస్టెంట్ టీబీ వంటి
కొన్ని రకాల టీబీ కోసం కొత్త టీబీ డయాగ్నస్టిక్ పరీక్షలను ఉపయోగించాల్సిన
అవసరాన్ని ఈ అధ్యయనం నొక్కి చెబుతుంది.
అంతేకాకుండా, ప్రైవేట్ రంగంలో చికిత్స పొందుతున్న టీబీ రోగులకు చికిత్స ఫలితాల
గురించి చాలా తక్కువ సమాచారం ఉంది. అంటే భారతదేశంలో వ్యాధి వాస్తవ వ్యాప్తిపై
పట్టు సాధించడం కష్టం.