న్యూ ఢిల్లీ : కరోనా వైరస్ సోకిన కోట్ల మంది ప్రజలకు తమ ప్రాణాలను సైతం పణంగా
పెట్టి, అవిశ్రాంతంగా విశేష సేవలందించి, కొవిడ్ యోధులుగా నిలిచిన భారతీయ
వైద్య సమాజానికి ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి-2022 అవార్డు
దక్కింది. దేశంలోని వైద్యులు, నర్సులందరి తరఫున ఇండియన్ మెడికల్
అసోసియేషన్(ఐఎంఏ), ట్రైన్డ్ నర్సెస్ ఆర్గనైజేషన్(టీఎన్ఏ)లకు ఈ
పురస్కారాన్ని అందజేయనున్నట్లు ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్
ప్రకటించింది. కొవిడ్ విజృంభించిన 2020, 2021లలో వైద్యులు, నర్సులు
నిరుపమానమైన సేవలను రోగులకు అందించారని ఎంపిక కమిటీకి నేతృత్వం వహించిన
విశ్రాంత సీజేఐ జస్టిస్ టి.ఎస్.ఠాకుర్ పేర్కొన్నారు. వైద్య సమాజానికి
దేశమంతటికీ ప్రాతినిధ్యం వహించే సంస్థ మన దేశంలో లేనందున ఇందిరా గాంధీ శాంతి
బహుమతిని స్వీకరించాల్సిందిగా ఐఎంఏ, టీఎన్ఏ సంస్థలను ఆహ్వానించినట్లు
తెలిపారు. ఐఎంఏ దేశంలో 1700 శాఖలతో 3.50 లక్షల మంది వైద్యులకు ప్రాతినిధ్యం
వహిస్తోంది. టీఎన్ఏలో 3.80లక్షల మంది నర్సులు సభ్యత్వం కలిగి ఉన్నారు.
అవార్డు కింద రూ.కోటితో పాటు ట్రోఫీ, ప్రశంసాపత్రాన్ని పురస్కార
గ్రహీతలకు అందజేస్తారు.