చర్చకు అనుమతించకపోవడం ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరచడమే
ప్రతిపక్షాల గొంతు నొక్కడంలో కేంద్రం నిమగ్నమైందని విమర్శ
న్యూఢిల్లీ : భారత్- చైనా సరిహద్దు ఉద్రిక్తతలపై పార్లమెంటులో చర్చకు
అనుమతించకపోవడంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ మండిపడ్డారు. అలాంటి
తీవ్రమైన సమస్యపై పార్లమెంటులో చర్చకు అనుమతి నిరాకరించడం.. మన
ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరచడమే అని ఆమె విమర్శించారు. భారత్-చైనా సరిహద్దు
ఉద్రిక్తతలపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు నిలదీస్తున్న వేళ సోనియాగాంధీ
అధ్యక్షతన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్లమెంటు
శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించింది. పార్లమెంటు
సెంట్రల్ హాల్లో జరిగిన ఈ భేటీకి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే,
లోక్సభ కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌధరి సహా ఇతర ఎంపీలు హాజరయ్యారు.
అనంతరం సోనియా మీడియాతో మాట్లాడారు. ‘‘మనపై దాడి చేయడానికి చైనా ఎందుకు
ధైర్యంగా ఉంది? ఈ దాడులను తిప్పికొట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి
సన్నాహాలు చేపట్టింది? ఇంకా ఏం చేయాలి? భవిష్యత్తులో చొరబడకుండా చైనాను
నిరోధించడానికి ప్రభుత్వ విధానం ఏమిటి? చైనాకు మనం ఎగుమతి చేసే దానికంటే
దిగుమతులు ఎక్కువ చేసుకుంటున్నాం. చైనా సైనిక శత్రుత్వానికి ఆర్థిక
ప్రతిస్పందన ఎందుకు ఇవ్వడం లేదు? తీవ్రమైన ఆందోళన కలిగించే విషయం పట్ల కేంద్రం
ఎందుకు మౌనం వహిస్తోంది?’’ అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సోనియా ప్రశ్నించారు.
పార్లమెంటులో చర్చను అడ్డుకుంటూ, ప్రతిపక్షాల గొంతును అణచివేయడంలో
కేంద్రప్రభుత్వం నిమగ్నమైందని సోనియా ఆరోపించారు. న్యాయవ్యవస్థ స్థాయిని కూడా
తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపణలు చేశారు.