ఆ దిశగా ప్రజా ప్రతినిధులు కృషి చేయాలి
బీజేపీ ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ : చిరుధాన్యాల వినియోగం ప్రజా ఉద్యమంగా మారాలని ప్రధానమంత్రి
నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ఈ మేరకు
బీజేపీ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. మోదీ ప్రసంగంలోని ప్రధాన అంశాలను
కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీ విలేకర్లతో పంచుకున్నారు. భారత్ చొరవతో 2023ను
ఐరాస ‘చిరుధాన్యాల సంవత్సరం’గా ప్రకటించిందని ప్రధాని సమావేశంలో గుర్తుచేశారు.
జి20కి భారత్ నేతృత్వం వహిస్తున్న సందర్భంగా దేశవ్యాప్తంగా పలు సదస్సులు
జరుగుతాయన్నారు. ఈ నేపథ్యంలో వివిధ సమావేశాలకు వేల మంది విదేశీయులు వస్తారని
వారి మెనూలో రకరకాల చిరుధాన్యాలతో చేసిన వంటకాలను అందుబాటులో ఉంచాలన్నారు.
పోషకాల లభ్యతలో చిరుధాన్యాలకున్న శక్తిని దృష్టిలో పెట్టుకుని అంగన్వాడీలు,
పాఠశాలలు, ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయ సమావేశాల్లో వాటి వినియోగం ఉండేలా చూడాలని
ఎంపీలకు సూచించారు. మిల్లెట్ల ఉపయోగాలపై అవగాహన పెంపొందేలా పలు వేదికలపై
చర్చలు జరిగేలా ప్రయత్నించాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు.
ఎంపీలకు చిరు విందు : భారత ప్రభుత్వం మధ్యాహ్న భోజన సమయంలో పార్లమెంటు
సభ్యులకు చిరుధాన్యాల వంటకాలతో విందు ఇచ్చింది. ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి
జగదీప్ ధన్ఖడ్, కేంద్రమంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. మిల్లెట్ కిచిడీ,
రాగి దోశ, జొన్న రోటీ, సజ్జల చూర్మా, కేక్ తదితర చిరుధాన్యాల వంటకాలను ఈ
విందులో వడ్డించారు.‘చిరుధాన్యాల సంవత్సరం 2023లోకి ప్రవేశిస్తున్న సమయంలో
అద్భుతమైన విందు. పార్టీలకతీతంగా అందరూ పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది’ అంటూ
తానూ, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
మల్లికార్జున ఖర్గే, రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, లోక్సభ స్పీకర్ ఓం
బిర్లాలు కూర్చుని ఉన్న ఫొటోను ప్రధాని ట్వీట్ చేశారు.