4-2తో పెనాల్టీ షూటవుట్ ద్వారా అర్జెంటీనా జయభేరి
మెస్సీ కల నెరవేరిన వైనం
అర్జెంటీనా ఖాతాలో మూడో వరల్డ్ కప్
ఖతార్ ఆతిథ్యమిచ్చిన ఫిఫా వరల్డ్ కప్ కు అద్భుతమైన ముగింపు లభించింది.
హోరాహోరీగా సాగిన ఫైనల్లో అర్జెంటీనా విజేతగా నిలిచింది. ఫ్రాన్స్ పై పెనాల్టీ
షూటవుట్ లో మెస్సీ సేన 4-2 తేడాతో నెగ్గింది. తద్వారా ప్రపంచకప్ కైవసం
చేసుకుంది. సాకర్ ఎందుకంత జనరంజకమైన క్రీడ అయిందో ఈ మ్యాచ్ చూస్తే
అర్థమవుతుంది. పోరాట పటిమకు, అద్భుతమైన డ్రిబ్లింగ్, అటాకింగ్ నైపుణ్యాలకు ఈ
మ్యాచ్ వేదికగా నిలిచింది. ఓ దశలో మ్యాచ్ పై ఆశలు కోల్పోయినట్టే కనిపించిన
ఫ్రాన్స్… స్టార్ ఆటగాడు కిలియన్ ఎంబాపే చలవతో రేసులోకొచ్చింది. కానీ
చివర్లో పెనాల్టీ షూటవుట్ లో అర్జెంటీనా గోల్ కీపర్ విశేష ప్రతిభ కనబర్చడంతో
ఫ్రాన్స్ ఆశలకు కళ్లెం పడింది…. అర్జెంటీనాను విజయలక్ష్మి వరించింది.
ఈ మ్యాచ్ లో అర్జెంటీనా తొలి అర్ధభాగంలో రెండు గోల్స్ కొట్టగా, ఫ్రాన్స్ తీవ్ర
నిరాశకు గురైంది. కానీ మరికాసేపట్లో ద్వితీయార్ధం ముగస్తుందనగా స్టార్
ఫార్వర్డ్ కిలియన్ ఎంబాపే రెండు గోల్స్ కొట్టడంతో ఫ్రాన్స్ 2-2తో సమం చేసింది.
నిర్ణీత సమయం వరకు అదే స్కోరు కొనసాగడంతో మ్యాచ్ ఎక్స్ ట్రా టైమ్ లోకి
ప్రవేశించింది. ఈ దశలో మెస్సీ అద్భుతమైన గోల్ తో అర్జెంటీనా 3-2తో ఆధిక్యం
సాధించింది. ఆ తర్వాత అర్జెంటీనా ఆటగాడి చేయి బంతికి తగలడంతో ఫ్రాన్స్ కు
పెనాల్టీ కిక్ లభించింది. ఎంబాపే ఎలాంటి పొరపాటు చేయకుండా బంతిని గోల్
పోస్టులోకి పంపడంతో స్కోరు 3-3తో సమమైంది. దాంతో పెనాల్టీ షూటవుట్
అనివార్యమైంది. పెనాల్టీ షూటవుట్లో అర్జెంటీనా ఆటగాళ్లు వరుసగా 4 సార్లు గోల్
పోస్టులోకి బంతిని తరలించగా…. ఫ్రాన్స్ రెండుసార్లు విఫలమైంది. అర్జెంటీనా
గోల్ కీపర్ అద్భుతంగా బంతిని అడ్డుకుని జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
కాగా, వరల్డ్ కప్ చరిత్రలో అర్జెంటీనాకు ఇది మూడో టైటిల్. ఆ జట్టు గతంలో 1978,
1986లో ప్రపంచవిజేతగా నిలిచింది. ఇక, వరల్డ్ కప్ గెలిచి కెరీర్ కు వీడ్కోలు
పలకాలన్న మెస్సీ కల ఘనంగా నెరవేరింది. ఈ టోర్నీలో విజేతగా నిలిచిన
అర్జెంటీనాకు రూ.347 కోట్ల భారీ ప్రైజ్ మనీ లభించింది. రన్నరప్ ఫ్రాన్స్
రూ.248 కోట్లు అందుకుంది.