పాక్ మంత్రి వ్యాఖ్యలపై ఆగ్రహం
పాక్ విదేశాంగ మంత్రి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీజేపీ దేశవ్యాప్తంగా
ఆందోళనలు చేపట్టింది. కాగా యూపీకి చెందిన ఓ బీజేపీ నేత ‘భుట్టో తల తీసుకొస్తే
రూ.2కోట్లు ఇస్తా’నని ప్రకటించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోపై
దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ‘భుట్టో తల తీసుకొస్తే
రూ.2కోట్ల రివార్డు ఇస్తా’నని ఉత్తర్‌ప్రదేశ్ బీజేపీ నేత మనుపాల్ భన్సల్
ప్రకటించారు. బాగ్‌పత్‌లోని జిల్లా పంచాయత్‌కు చెందిన మనుపాల్ భుట్టో వ్యాఖ్యలకు
వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో ఈ ప్రకటన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన
తన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నట్లు స్పష్టం చేశారు.
‘ మోడీ కోసం ఏదైనా చేస్తాం’
“అవును నేను ఆ వ్యాఖ్యలు చేశాను. మనం ఎంతో గౌరవించే ప్రధాని నరేంద్ర మోడీ
గురించి వారు అలాంటి మాటలు మాట్లాడుతుంటే మేం సహించం. ప్రధాని అంటే మాకు చాలా
గౌరవం ఉంది. ఆయన కోసం ఎలాంటి పనైనా చేస్తాం” అని మనుపాల్ భన్సల్
వ్యాఖ్యానించారు. మరోవైపు బిలావల్ భుట్టో వ్యాఖ్యలకు వ్యతిరేకంగా
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి.
కోల్‌కతా, రాంచీ, పుణె, దిల్లీ, గోరఖ్‌పుర్‌లో ఆ పార్టీ కార్యకర్తలు నిరసనలతో
హోరెత్తించారు. పుణెలో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దాయాది దేశం
జాతీయ జెండాలను దహనం చేశారు. ఈ ఆందోళనల్లో పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా
పాల్గొన్నారు. ప్రధాని మోదీని కించపరచే వ్యాఖ్యలు చేస్తే సహించబోమని
హెచ్చరించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ కమలం పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
బిలావల్ దిష్టిబొమ్మను దహనం చేసి పాకిస్థాన్‌కు వ్యతిరేక నినాదాలు చేశారు.