అప్పటి వరకు ఆగడమెందుకని ప్రశ్నించిన పీకే
ఇప్పుడే ఆయనను సీఎం చేస్తే మూడేళ్లు అధికారంలో ఉంటారు
తేజస్వీ యాదవ్‌ను బీహార్ ముఖ్యమంత్రిగా ప్రకటించేందుకు 2025 ఎన్నికల వరకు
ఆగాల్సిన పనిలేదని, ఇప్పుడే ఆయనను సీఎంగా ప్రకటించాలని ముఖ్యమంత్రి నితీశ్
కుమార్‌కు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సూచించారు. జన్ సురాజ్
పాదయాత్రలో భాగంగా షియోమర్లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 2025
అసెంబ్లీ ఎన్నికల్లో ‘మహాఘట్బంధన్’(మహాకూటమి)ను తేజస్వీ యాదవ్ నడిస్తారని,
అప్పటి వరకు ఆయన ఆగాల్సిందేనని నితీశ్ కుమార్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను
ఉద్దేశించి పీకే ఈ వ్యాఖ్యలు చేశారు. తేజస్వీని ఇప్పుడే ముఖ్యమంత్రిని చేస్తే
మూడేళ్లు ఆయన పదవిలో ఉంటారని, ఆయన పనితీరు ఆధారంగా వచ్చే ఎన్నికల్లో ఓటువేసే
అవకాశం ప్రజలకు లభిస్తుందని అభిప్రాయపడ్డారు. తేజస్వీ భవిష్యత్ నేత అని,
ముఖ్యమంత్రి అదే చెప్పారని ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇస్తున్న సీపీఐ
(ఎంఎల్) లిబరేషన్ శాసనసభా పక్షనేత మహబూబ్ అలం పేర్కొన్నారు. బీజేపీ
మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న మహాకూటమికి నితీశ్ నిర్ణయం ప్రయోజనం
చేకూరుస్తుందని తాము విశ్వసిస్తున్నట్టు తెలిపారు. ఆయన శక్తిమంతమైన నాయకుడని
తేజస్వీని కీర్తించారు.