పేలుడుతో పాటు తుపాకీ పేలుళ్ల శబ్దాలు కూడా వినిపించినట్లు స్థానికులు
తెలిపారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం గురించి ఇంకా స్పష్టత రాలేదు. అఫ్గానిస్థాన్
రాజధాని కాబుల్ మరోసారి బాంబు పేలుడు, కాల్పులతో దద్దరిల్లింది. ఈ నగరంలో
అత్యంత రద్దీగా ఉండే షహర్-ఇ నావ్ ప్రాంతంలోని ఓ హోటల్లో ఉగ్రదాడి జరిగింది.
‘చైనీస్ గెస్ట్ హౌస్’గా పిలిచే ఈ భవనానికి తరచూ చైనా వ్యాపారులు వస్తుంటారు.
భారీ పేలుడుతో పాటు తుపాకీ పేలుళ్ల శబ్దాలు కూడా వినిపించినట్లు స్థానికులు
తెలిపారు.
పేలుడు తర్వాత కొందరు సాయుధులు భవనంలోకి ప్రవేశించి కాల్పులు జరిపినట్లు
తెలుస్తోంది. ప్రస్తుతం ఈ హోటల్లో కాల్పులు జరుగుతున్నట్లు స్థానిక మీడియా
కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ ఘటనలో ప్రాణ నష్టం గురించి ఇంకా స్పష్టత
రాలేదు. కాగా అఫ్గాన్‌లో చైనీయుల భద్రతపై చైనా రాయబారి వాంగ్ యు ఆదివారం
అఫ్గాన్ విదేశాంగ శాఖ అధికారులను కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. ఆ మరుసటి రోజే
ఈ దాడి చోటుచేసుకోవడం గమనార్హం.
అఫ్గాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉగ్రదాడి, కాల్పుల ఘటనలు
మరింత పెరిగాయి. ఈ ఏడాది సెప్టెంబరులో ఇస్లామిక్ స్టేట్ జరిపిన ఆత్మాహుతి
దాడిలో ఇద్దరు రష్యన్ ఎంబసీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉండగా నిన్న
అఫ్గాన్-పాక్ సరిహద్దుల్లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. బలూచిస్థాన్‌లోని
చమన్ జిల్లాలోపాక్ పౌరులపై తాలిబన్ బలగాలు విచక్షణారహితంగా కాల్పులు
జరిపాయి. ఈ దాడిలో ఆరుగురు మృతి చెందగా, 17 మందికి గాయాలయ్యాయి.