పదిహేడేళ్ల వయసులో కార్యకర్తగా చేరి అంచెలంచెలుగా ఎదిగిన నేత
ఐదోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సుఖ్విందర్ సింగ్
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్న సుఖ్విందర్
సింగ్ సుఖు నేపథ్యం సాధారణ కుటుంబమే! ఆయన తండ్రి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో
డ్రైవర్ గా పనిచేసేవారు. పదిహేడేళ్ల వయసులో సాధారణ కార్యకర్తగా సుఖ్విందర్
రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్త నుంచి
ముఖ్యమంత్రి దాకా ఎదిగిన సుఖ్విందర్.. చదువుకునే రోజుల్లో పాలు అమ్మారు. ఛోటా
సిమ్లాలో ఓ పాల బూత్ ను నిర్వహించారు.
1964 మార్చి 27న పుట్టిన సుఖ్విందర్ సింగ్ సుఖు హిమాచల్ ప్రదేశ్ యూనివర్శిటీ
నుంచి ఎంఏ, ఎల్ఎల్ బీ పూర్తిచేశారు. విద్యార్థి దశలో ఎన్ఎస్ యూఐలో చురుకుగా
వ్యవహరించారు. సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్ కు రెండు సార్లు కౌన్సిలర్ గా
కూడా సుఖ్విందర్ సేవలందించారు. అంచెలంచెలుగా ఎదిగారు. తర్వాత యూత్ కాంగ్రెస్
రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. హామిర్పూర్లోని నాదౌన్ నుంచి
2003లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవలి ఎన్నికల్లో ఐదోసారి ఎమ్మెల్యేగా
గెలుపొందారు. 2008లో పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, 2013 నుంచి 2019 దాకా
హెచ్పీసీసీ చీఫ్గా ఉన్నారు. ప్రస్తుతం పార్టీ ప్రచార కమిటీ
చైర్మన్గా ఉన్న సుఖ్విందర్ ను కాంగ్రెస్ అధిష్ఠానం హిమాచల్ ప్రదేశ్ కు 15వ
ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది.