టికెట్ కొని మెట్రో ట్రైన్ లో ప్రయాణించిన ప్రధాని
మహారాష్ట్రలో పర్యటిస్తున్న నరేంద్ర మోడీ
నాగ్ పూర్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మహారాష్ట్రలోని నాగ్ పూర్, ఛత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ మధ్య ఆరవ వందే భారత్
ఎక్స్ ప్రెస్ ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. మహారాష్ట్ర, గోవా
పర్యటనలో భాగంగా ఆదివారం ఉదయం మోదీ నాగ్ పూర్ కు చేరుకున్నారు. కేంద్ర మంత్రి
నితిన్ గడ్కరీ, రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ, ముఖ్యమంత్రి ఏక్ నాథ్
షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ లు ప్రధాని మోడీకి స్వాగతం పలికారు.
అనంతరం వందే భారత్ రైలుకు జెండా ఊపి ప్రధాని ప్రారంభించారు. నాగ్ పూర్ లో
మెట్రో మొదటి దశను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఫ్రీడమ్ పార్క్
స్టేషన్ లో టికెట్ కొనుగోలు చేసిన ప్రధాని ఖాప్రీ వరకు మెట్రోలో ప్రయాణించారు.
ట్రైన్ లోపల విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. రూ.6,700 కోట్లకు పైగా వ్యయంతో
అభివృద్ధి చేయనున్న ఫేజ్ -2 పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ పర్యటనలో
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వన్ హెల్త్, నాగ్ రివర్ పొల్యూషన్ అబెట్మెంట్
ప్రాజెక్ట్‌లకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని పీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది.
సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ,
సెంటర్ ఫర్ రీసెర్చ్, మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ ఆఫ్ హిమోగ్లోబినోపతిని
ప్రారంభిస్తారని వివరించింది.