ప్రపంచంలోని సంపన్న కంపెనీల జాబితాలో రిలయన్స్
భారత్ నుంచి మొత్తం 20 కంపెనీలకు దక్కిన చోటు
ప్రపంచంలోకెల్లా అత్యంత సంపన్న కంపెనీగా అమెరికాకు చెందిన యాపిల్ సంస్థ
నిలిచింది. యాపిల్ కంపెనీ మార్కెట్ విలువ 2.4 లక్షల కోట్ల డాలర్లని లండన్ కు
చెందిన హురూన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ పేర్కొంది. 2022 ఏడాదికి గానూ
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపన్న కంపెనీల జాబితాను ఈ సంస్థ విడుదల చేసింది. ఇక
రెండో స్థానంలో 1.8 లక్షల కోట్ల డాలర్ల విలువతో మైక్రోసాఫ్ట్ నిలిచింది.
మొత్తం 500 కంపెనీల పేర్లతో లిస్ట్ విడుదల చేయగా ఇందులో భారత దేశానికి చెందిన
రిలయన్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సహా 20 కంపెనీలకు చోటు దక్కింది. ఈ 500
కంపెనీల మొత్తం సంపద 11.1 లక్షల కోట్ల డాలర్లని హురూన్ సంస్థ తెలిపింది.
గత రెండేళ్ల అంచనాలతో పోలిస్తే తాజాగా ఈ కంపెనీల విలువ 7 బిలియన్ డాలర్లు
పెరిగిందని హురూన్ ఇండియా చైర్మన్ రూపర్ట్ హుగెవెర్ఫ్ చెప్పారు.
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీతో పాటు గౌతమ్ ఆదానీకి చెందిన పలు కంపెనీలు ఈ
జాబితాలో ఉన్నాయి. 202 బిలియన్ల అమెరికన్ డాలర్ల విలువతో రిలయన్స్ ఇండస్ట్రీస్
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపన్న కంపెనీల జాబితాలో 34 వ స్థానాన్ని
దక్కించుకుంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ విలువ 139 బిలియన్ల అమెరికన్
డాలర్లని హురూన్ రీసెర్చ్ అంచనా వేసింది. వీటితో పాటు 1.3 లక్షల కోట్ల డాలర్ల
సంపదతో ఆల్ఫాబెట్ కంపెనీ ఈ లిస్ట్ లో టాప్ 3 స్థానంలో నిలిచింది. అమేజాన్(1.2
లక్షల కోట్ల డాలర్లు) నాలుగో స్థానం దక్కించుకుంది. ఎలన్ మస్క్ కంపెనీ టెస్లా
672 బిలియన్ డాలర్ల విలువతో ఐదో స్థానంలో, వారెన్ బఫెట్ కంపెనీ బెర్క్ షైర్
హాథవే 624 బిలియన్ డాలర్లతో ఆరో స్థానంలో నిలిచాయి.