పాక్ వంటి దేశాల్లో దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిక
ఐరాస : ఐరాస ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశాలు, సంస్థలకు మానవతా సహాయం విషయంలో
మినహాయింపు ఇవ్వడాన్ని భారత్ వ్యతిరేకించింది. ఈ సాకుతో పాకిస్థాన్ వంటి
దేశాల్లో ఉగ్రసంస్థలు లబ్ధి పొందే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. 15 దేశాలతో
కూడిన ఐరాస భద్రతా మండలికి ప్రస్తుతం భారత్ నేతృత్వం వహిస్తోంది. ఐరాస ఆంక్షల
నుంచి మానవతా సహాయానికి మినహాయింపు అంశంపై అమెరికా, ఐర్లాండ్ దేశాలు
శుక్రవారం తీర్మానం ప్రవేశపెట్టగా మండలిలోని 14 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి.
భారత్ ఒక్కటే వ్యతిరేకించింది. ఇందుకు కారణాలను మండలి ప్రెసిడెంట్, ఐరాసలో
భారత్ తరఫున శాశ్వత ప్రతినిధి రుచిర కాంబోజ్ స్పష్టం చేశారు. ఇలాంటి
మినహాయింపులతో ఉగ్రసంస్థలు లబ్ధి పొందుతున్న నేపథ్యంలో భారత్
వ్యతిరేకిస్తోందని వెల్లడించారు. ‘‘మా పొరుగు దేశం పాకిస్థానే ఇందుకు ఉదాహరణ.
ఆ దేశంలోని జమాత్ ఉద్ దవా (జేయూడీ) తనను తాను మానవతా దాతృత్వ సంస్థగా
చెప్పుకొంటుంది. ఆ సంస్థను లష్కరే తోయిబా నడిపిస్తోంది. ఇలాంటి సంస్థలు అక్కడ
ఎన్నో ఉన్నాయి. మానవతా సహాయం పేరుతో ఈ సంస్థలు నిధులు పొంది ఉగ్రవాదుల
నియామకాలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐరాస ఆంక్షల నుంచి మానవతా సహాయానికి
మినహాయింపుపై నిశిత పరిశీలన చేయాలి’’ అని రుచిర సూచించారు. ఈ తీర్మానం అమలుతో
లెక్కలేనంత మంది ప్రాణాలను కాపాడవచ్చని అమెరికా పేర్కొంది.