న్యూ ఢిల్లీ : ఎయిమ్స్ డేటాబేస్‌పై సైబర్ దాడి తర్వాత హ్యాకర్స్ ఐసీఎంఆర్
సర్వర్‌ను కూడా హ్యాక్ చేసేందుకు ప్రయత్నించారట. ఈ మేరకు ప్రభుత్వ సంస్థలు,
కార్యాలయాల్లోని డేటాబేస్‌పై సైబర్ దాడికి యత్నించిన వివరాలకు సంబంధించిన
నివేదికను ఎన్ఐసీ విడుదల చేసింది. దేశంలోని పెద్ద ఆస్పత్రుల్లో రోగుల
వివరాలు లక్ష్యంగా హ్యాకర్లు సైబర్ దాడులు చేస్తున్నారు. గతవారం ఢిల్లీ
ఎయిమ్స్, తమిళనాడులోని ఓ ఆస్పత్రి డేటాబేస్‌పై హ్యాకర్స్ సైబర్‌దాడికి
పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సైబర్ నేరగాళ్లు నవంబరు 30న భారత వైద్య
పరిశోధన మండలి సర్వర్‌ను హ్యాక్ చేసేందుకు సుమారు ఆరువేలసార్లు
ప్రయత్నించారట. అయితే, వారు ఐసీఎమ్ఆర్ సర్వర్‌ను హ్యాక్ చేయలేకపోయారని
కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఓ
నివేదికను విడుదల చేసింది. ఇందులో దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలు,
కార్యాలయాల్లోని డేటాబేస్‌పై హ్యాక్ చేసేందుకు ప్రయత్నించిన ఘటనలకు
సంబంధించిన వివరాలను వెల్లడించింది. ఐసీఎంఆర్ డేటాబేస్‌పై దాడికి యత్నించింది
హాంకాంగ్ దేశానికి చెందిన ఐపీ అడ్రస్‌గా గుర్తించారు. ఐసీఎంఆర్ ఫైర్‌వాల్,
భద్రతా సాంకేతికత అప్డేట్గా ఉండటం వల్ల హ్యాక్ చేయలేకపోయారని ఎన్ఐసీ
నివేదికలో వెల్లడించింది. అంతేకాకుండా సైబర్ దాడికి యత్నించిన ఐపీ అడ్రస్‌ను
బ్లాక్ చేసినట్లు తెలిపింది. గత నెలలో ఢిల్లీ లోని ఎయిమ్స్ సర్వర్‌పై దాడి
చేసిన సైబర్ నేరగాళ్లు ఆరు రోజులపాటు వాటిని పనిచేయకుండా నిలిపివేశారు.
సుమారు రూ. 200 కోట్ల మొత్తాన్ని క్రిప్టో కరెన్సీ రూపంలో ఎయిమ్స్ నుంచి
డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ సర్వర్లలో సుమారు కోట్ల మంది రోగుల
సమాచారంతోపాటు వీవీఐపీలు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీల సమాచారం ఉండటంతో ఆ డేటా
ప్రమాదంలో పడినట్లైంది. ఈ సర్వర్‌ను కూడా హాంకాంగ్ నుంచి హ్యాక్ చేసినట్లు
సమాచారం. దీని వెనుక చైనా హస్తం ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం
ఈ సర్వర్లను తిరిగి పనిచేసేలా యాంటీ వైరస్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు.