ఓటేసిన శతాధిక వృద్ధురాలు
అహ్మదాబాద్ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. తొలి
విడత పోలింగ్‌లో కాముబెన్ లాలాభీ అనే 100 ఏళ్ల బామ్మ తన ఓటు హక్కు
వినియోగించుకుంది. ఉమర్గాంలోని ఓ పోలింగ్ స్టేషన్‌కు వెళ్లి ఓటేసింది. 89
నియోజకవర్గాల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించునేందుకు పోలింగ్ స్టేషన్లకు
చేరుకుంటున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు అధికారులు
అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటల నుంచి ఓటింగ్ ప్రారంభమవుతుంది.
సౌరాష్ట్ర, కచ్, దక్షిణ గుజరాత్ ప్రాంతాల్లోని 19 జిల్లాల్లో 89 స్థానాలకు
మొదటి దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. త్రిముఖ పోటీ నెలకొన్న ఈ ఎన్నికల్లో
అధికార బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ హోరాహోరిగా ప్రచారాన్ని నిర్వహించగా,
కాంగ్రెస్ పార్టీ నిశ్శబ్ధ ప్రచారం అంటూ క్షేత్ర స్థాయిలో నాయకులు గడప గడపకు
తిరుగుతూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు.
2017 ఫలితాలు ఇలా : తొలి దశ పోలింగ్ జరుగుతున్న ఈ 89 స్థానాల్లో 2017
ఎన్నికల్లో బీజేపీ 48 చోట్ల విజయం సాధిస్తే కాంగ్రెస్ 40 సీట్లలో
గెలుపొందింది. ఒక్క స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఈ సారి
ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బలం పుంజుకోవడంతో త్రిముఖ పోటీ నెలకొంది.
ఇక ఎస్పీ, బీఎస్పీ, లెఫ్ట్ పార్టీలతో పాటుగా, భారతీయ ట్రైబల్ పార్టీ
(బీటీపీ) కూడా పోటీ చేస్తున్నాయి.
బరిలో 788 మంది : తొలి దశలో 788 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని
పరీక్షించుకుంటున్నారు.బీజేపీ, కాంగ్రెస్ మొత్తం 89 స్థానాల్లో పోటీ పడుతూ
ఉంటే, ఆప్ 88 స్థానాల్లో పోటీ చేస్తోంది.. తూర్పు సూరత్ నియోజకవర్గం
అభ్యర్థి ఆఖరి నిమిషంలో తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో ఆప్ 88 స్థానాలకే
పరిమితమవాల్సి వచ్చింది. ఆప్ సీఎం అభ్యర్థి ఇసుదాన్ గధ్వీ ద్వారక
జిల్లాలోకి కంభాలియా నుంచి పోటీ పడుతూ ఉంటే ఆప్ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్
ఇటాలియా సూరత్‌లోని కటాగ్రామ్ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
తొలి దశ పోటీలో ఉన్న ముఖ్యుల్లో క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రవీబా జడేజా
జామ్‌నగర్ (ఉత్తరం) నుంచి బరిలో ఉన్నారు.
పోలింగ్ జరగనున్న నియోజకవర్గాలు- 89
పోటీ పడుతున్న అభ్యర్థులు- 788
మహిళా అభ్యర్థులు- 70
స్వతంత్ర అభ్యర్థులు- 339
ఓటర్ల సంఖ్య- 2.39 కోట్లు
పోలింగ్ కేంద్రాలు – 1,432