మాస్కో : తమ మధ్య బలపడుతున్న రక్షణ బంధాన్ని ప్రదర్శిస్తూ రష్యా, చైనా బాంబర్
విమానాలు పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంపై సంయుక్త గస్తీ విన్యాసాలు చేశాయి.
రష్యాకు చెందిన టుపొలెవ్ 95, చైనాకు చెందిన హెచ్-6కె బాంబర్ విమానాలు
జపాన్ సముద్రం, తూర్పు చైనా సముద్రాలపై ఎనిమిది గంటలసేపు ఎగిరాయి. రష్యా
విమానాలు మొట్టమొదటిసారి చైనాలో దిగడం, చైనా విమానాలు తొలిసారి రష్యాలోని
వైమానిక స్థావరానికి వెళ్లడం విశేషం. తమ సంయుక్త విన్యాసాలు ఏ దేశానికీ
వ్యతిరేకం కావని రష్యా రక్షణ శాఖ ప్రకటించినా ఉక్రెయిన్, తైవాన్ సమస్యలపై
అమెరికాతో ఈ రెండు దేశాలకూ ఉద్రిక్తతలు పెరుగుతుండడం గమనార్హం. సెప్టెంబరులో
రష్యాలో జరిగిన సంయుక్త సైనిక విన్యాసాల్లో పాల్గొనడానికి 2000 మంది సైనికులు,
300 సైనిక వాహనాలు, 21 యుద్ధ విమానాలు, మూడు యుద్ధ నౌకలను చైనా పంపింది.
ఉక్రెయిన్ యుద్ధం విషయంలో రష్యాను విమర్శించడానికి చైనా నిరాకరించింది.
అమెరికా, ఐరోపాలు రష్యాపై కఠిన ఆంక్షలు విధించడాన్ని మాత్రం తప్పు పట్టింది.
రష్యా, చైనాలు దగ్గరవుతున్నట్లు ఇదంతా నిరూపిస్తోంది.
ఉలిక్కిపడ్డ దక్షిణ కొరియా : ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా చైనాకు చెందిన
హెచ్-6 బాంబర్లు పదేపదే తమ గగనతలంలో ప్రవేశించి, నిష్క్రమిస్తుండడంతో దక్షిణ
కొరియా ఉలిక్కిపడింది. ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వెంటనే
తమ యుద్ధ విమానాలను సన్నద్ధం చేసింది.