అదంతా నా బలాన్ని పెంచుతోంది
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ
ఇందోర్ : తన ప్రతిష్ఠను దెబ్బతీయడానికి బీజేపీ రూ.వేల కోట్లు ఖర్చు
చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. భారత్ జోడో పాదయాత్ర
నిర్వహిస్తున్న ఆయన మధ్యప్రదేశ్‌లోని ఇందోర్ సమీపంలో విలేకరులతో మాట్లాడారు.
యాత్రలో ఆయన ఆహార్యం తీరుపై ప్రశ్నకు సమాధానమిస్తూ తన ఇమేజ్‌కు గండి
కొట్టడానికి బీజేపీ ఎంత ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తోందో అంత బలం తనకు వస్తోందనీ,
వాస్తవాలను ఎవరూ దాచిపెట్టలేరని చెప్పారు. ‘‘ఒక పెద్దశక్తి మీద
పోరాడుతున్నప్పుడు వ్యక్తిగత దాడులు జరుగుతాయి. నేను సరైన మార్గంలోనే
వెళ్తున్నానని అవి చాటుతున్నాయి. ఆ దాడులే నా గురువులు. నాకు సరైన మార్గాన్ని
అవి చూపిస్తున్నాయి. భాజపా, ఆరెస్సెస్‌ల సిద్ధాంతాలేమిటో నాకు
నెమ్మదినెమ్మదిగా అర్థమవుతోంది’’ అని రాహుల్ వివరించారు. ఉమ్మడి పౌరస్మృతిపై
బీజేపీ , కాంగ్రెస్‌ల విధానాలు స్పష్టంగా ఉన్నాయనీ, తమపని తాము
చేసుకువెళ్తున్నామని చెప్పారు. రాజస్థాన్‌లో సీఎం అశోక్ గహ్లోత్, మాజీ ఉప
ముఖ్యమంత్రి సచిన్ పైలట్లు ఇద్దరూ కాంగ్రెస్‌కు విలువైన నేతలే అని
పేర్కొన్నారు.
అమేఠీపై తర్వాత చెబుతా : 2024లో అమేఠీ నియోజకవర్గం నుంచే పోటీచేస్తారా అన్న
ప్రశ్నకు రాహుల్ ఆచితూచి స్పందించారు. ఇప్పుడే దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు
చేయబోనని.. మరో ఏడాది, ఏడాదిన్నర తర్వాత సమాధానం చెబుతానని అన్నారు. ప్రస్తుతం
తన దృష్టి అంతా భారత్ జోడో యాత్రపైనే కేంద్రీకృతమైందని తెలిపారు. దేశ సంపద
మొత్తం ముగ్గురు నలుగురు పారిశ్రామికవేత్తల చేతుల్లో ఉండడమే నిరుద్యోగ సమస్యకు
కారణమన్నారు. తన యాత్ర ద్వారా ప్రజావాణి బలంగా వినిపిస్తోందని చెప్పారు. ఈ
యాత్రను గతంలోనే చేయాలనుకున్నా కొవిడ్-19 తీవ్రత సహా వివిధ కారణాల వల్ల
సాధ్యం కాలేదన్నారు. ఇందోర్‌లో ఓ ఆరెస్సెస్ కార్యకర్త కూడా తనకు స్వాగతం
పలికారని చెప్పారు. యాత్రలో రాహుల్ కొద్ది దూరం సైకిల్ తొక్కారు.
అడ్డుకుంటామన్న గుజ్జర్లతో రాజస్థాన్ మంత్రుల చర్చలు : డిసెంబరు 4న రాహుల్
యాత్ర రాజస్థాన్‌లో ప్రవేశించనుంది. తమ రిజర్వేషన్లు సహా వివిధ డిమాండ్లను
తీర్చకపోతే ఈ యాత్రను అడ్డుకుంటామంటూ గుజ్జర్లు ప్రకటించిన నేపథ్యంలో
రాజస్థాన్ మంత్రుల ఉపసంఘం రంగంలోకి దిగింది. ఎక్కువ డిమాండ్లపై ఏకాభిప్రాయం
కుదిరినట్లేననీ, అధికారులతో సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని
మంత్రులు తెలిపారు. మంగళవారం మరో విడత చర్చలు జరగనున్నాయి.