ఆరు నెలలపాటు సీఎస్ఎస్ నిర్మాణంలో విధులు
బీజింగ్ : ఇంతవరకు అమెరికా, రష్యాలదే పైచేయిగా ఉన్న రోదసిలో చైనా తనదైన ముద్ర
వేయనున్నది. సమీప భూ కక్షలో చైనా అంతరిక్ష కేంద్ర (సీఎస్ఎస్) నిర్మాణం మరో
ఆరు నెలల్లో పూర్తవుతుంది. సీఎస్ఎస్లోని కోర్ మాడ్యూల్ టియాన్ హేకు
మంగళవారం ముగ్గురు వ్యోమగాములను పంపుతున్నట్లు చైనా మానవసహిత అంతరిక్ష
ప్రయోగాల సంస్థ సీఎంఎస్ఏ ప్రకటించింది. లాంగ్ మార్చ్ రాకెట్‌పై రోదసిలోకి
దూసుకెళ్లే షెన్ ఝౌ-15 వ్యోమనౌక టియాన్ హేతో కలుస్తుంది. ఆ నౌకలోని త్రిసభ్య
బృందం టియాన్ హేలో ఆరు నెలలపాటు ఉండి చైనా అంతరిక్ష నౌక నిర్మాణాన్ని
పూర్తిచేస్తారు. వారికి కావలసిన సామగ్రిని భూమి నుంచి రాకెట్ల ద్వారా
పంపుతున్నారు. ముగ్గురు వ్యోమగాములు పని పూర్తి చేసుకుని వచ్చే ఏడాది మే నెలలో
భూమికి తిరిగివస్తారు. వీరికన్నా ముందు చైనా రెండు బృందాలను కక్ష్యలోకి
పంపింది. ఒక్కో బృందంలో ముగ్గురేసి వ్యోమగాములున్నారు. ఒక్కో బృందం
ఆరునెలలపాటు కక్ష్యలో ఉండి అంతరిక్ష కేంద్ర నిర్మాణాన్ని కొనసాగించింది.
మొత్తం మూడు బృందాలు రొటేషన్ పద్ధతిపై ఆరేసి నెలలపాటు అంతరిక్ష కేంద్ర
నిర్మాణంలో పాల్గొంటున్నాయి. రష్యా నిర్మించిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం
(ఐఎస్ఎస్) ప్రస్తుతం కక్ష్యలో పరిభ్రమిస్తున్నది. దాని ఆయుష్షు కొన్నేళ్లలో
తీరిపోనుంది. ఇక అప్పుడు కక్ష్యలో తిరిగే ఏకైక అంతరిక్ష కేంద్రం చైనా
సీఎస్ఎస్సే అవుతుంది. ఈ నెల 16న అమెరికా అత్యంత శక్తిమంతమైన ఆర్టెమిస్
రాకెట్‌ను రోదసిలోకి ప్రయోగించింది. మున్ముందు ఆర్టెమిస్ ద్వారా మానవరహిత
వ్యోమ నౌకను చంద్రుని వైపు పంపుతారు. తరవాత క్రమంగా అమెరికన్ వ్యోమగాములు
చంద్రునిపై దిగుతారు. చైనా కూడా ఇకపై అదే పని చేపట్టబోతోంది.