సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే విదేశీ విద్యార్థులపై ఆంక్షలు
తీసుకురావాలని యోచిస్తోంది. బ్రిటన్లో రిషి సునాక్ ప్రభుత్వాన్ని వలసలు
కలవరపెడుతున్నాయి. దేశంలో వలసదారుల సంఖ్య నానాటికీ పెరగుతుండటంతో దీన్ని
నియంత్రించేందుకు కొత్త విధానాన్ని తీసుకురావాలని ప్రధాని సునాక్
యోచిస్తున్నారు. ఇందుకోసం విదేశీ విద్యార్థుల సంఖ్యను తగ్గించడంతో పాటు ఇతర
మార్గాలను అన్వేషిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
‘‘వలస వ్యవస్థను పటిష్టం చేసేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను
పరిశీలిస్తున్నాం. వలసదారుల సంఖ్యను తగ్గించేందుకు ప్రధాని సునాక్ పూర్తిగా
కట్టుబడి ఉన్నారు’’ అని డౌనింగ్ స్ట్రీట్ అధికార ప్రతినిధి మీడియాతో
అన్నారు. ఇందులో భాగంగానే యూకేకు వచ్చే విదేశీ విద్యార్థులపై కొన్ని ఆంక్షలు
విధించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పెద్దగా ప్రాధాన్యం లేని డిగ్రీల కోసం
వచ్చే విద్యార్థులు, డిపెండెంట్ వీసాలతో వచ్చే విద్యార్థులపై ఈ ఆంక్షలు ఉండే
అవకాశముందట. అయితే ఈ ఆంక్షలు ఏంటీ? ‘ప్రాధాన్యం లేని’ డిగ్రీలు అని వేటిని
నిర్ణయిస్తారనే దానిపై ఆ అధికార ప్రతినిధి స్పష్టతనివ్వలేదు.*
బ్రిటన్లో ఇటీవల వలసల సంఖ్య అమాంతం పెరిగింది. 2021లో 1.73లక్షల మంది
వలసదారులు ఉండగా ఈ ఏడాదికి ఆ సంఖ్య 5లక్షలు దాటడం గమనార్హం. అయితే, అంతర్జాతీయ
విద్యార్థుల్లో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు. దీంతో సునాక్ ప్రభుత్వం
ఆంక్షలు విధిస్తే.. భారతీయులపైనే అధిక ప్రభావం ఉండే అవకాశముందని పలువురు
అభిప్రాయపడుతున్నారు. అయితే, విదేశీ విద్యార్థుల సంఖ్యను తగ్గించడం ద్వారా
వలసలను నియంత్రించడం అనేది చాలా క్లిష్టమైన ప్రక్రియ అని నిపుణులు
చెబుతున్నారు. బ్రిటన్లో కొన్ని విశ్వవిద్యాలయాలు పూర్తిగా విదేశీ
విద్యార్థులపైనే ఆధారపడి నడుస్తున్నాయి. ఒకవేళ ఆంక్షలు విధిస్తే.. ఆ
యూనివర్శిటీలు దివాలా తీసే ప్రమాదం ఉందట. కాగా ఈ వలసల విషయంలో యూకే ప్రభుత్వం
విమర్శలు, వివాదాలు ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. గతంలో యూకే హోంమంత్రి
సుయోల్లా బ్రేవర్మన్.. భారతీయ విద్యార్థులను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు
తీవ్ర దుమారం రేపాయి. ఆ తర్వాత ఆమె పదవికి రాజీనామా చేసింది. అయితే సునాక్
అధికారంలోకి వచ్చాక, మళ్లీ బ్రేవర్మన్ను హోంమంత్రిని చేయడం గమనార్హం.