సంస్కారవంతమైన జీవితానికి పుస్తక పఠనం చాలా ముఖ్యం
రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు
గుంటూరు : రాష్ట్రంలో సమీకృత, సమగ్ర, సమర్ధవంతమైన గ్రంథాలయ సేవలను పాఠకులకు
అందించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
గ్రంథాలయ వ్యవస్థను పటిష్ట పరచటానికి విప్లవాత్మకమైన కార్యక్రమాలను అమలు
చేస్తున్నారని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు తెలిపారు.
శుక్రవారం మంగళగిరిలోని గ్రంథాలయ పరిషత్ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర
గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు, పౌర గ్రంధాలయ శాఖ సంచాలకులు
డా.ఎం.ఆర్. ప్రసన్న కుమార్ తో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ
సందర్భంగా రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు మాట్లాడుతూ
సంస్కారవంతమైన జీవితానికి పుస్తక పఠనం చాలా ముఖ్యమని, రాష్ట్ర వ్యాప్తంగా పౌర
గ్రంథాలయాల్లో పాఠకులకు మెరుగైన సేవలు అందించేలా ప్రణాళిక ప్రకారం చర్యలు
తీసుకుంటున్నామన్నారు. గత ప్రభుత్వాల కాలంలో గ్రంథాలయ వ్యవస్థ పూర్తిగా
నిర్లక్ష్యంకు గురైందని, గ్రంథాలయాల సెస్ నిధులను సైతం వేరే శాఖలకు
మళ్ళించారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అట్టడుగు
వర్గాలకు ప్రభుత్వ పాఠశాలలో కార్పోరేట్ స్థాయి నాణ్యమైన విద్యను అందించటానికి
విద్యారంగంలో సమూల మార్పులు చేస్తున్న విధంగా, గ్రామస్థాయిలో గ్రంధాలయ
వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావటానికి, రాష్ట్ర వ్యాప్తంగా 10960 డిజిటల్
లైబ్రరీలను ఏర్పాటుకు శ్రీకారం చుట్టి సమాజ అభ్యుదయానికి కృషి
చేస్తున్నారన్నారు. పోటీపరీక్షలకు సిద్ధం అవుతున్న వారికి అవసరమైన పుస్తకాలను
గ్రంథాలయాలలో అందుబాటులో ఉంచటంతో పాటు, లైబ్రరీలను డిజిటలైజేషన్, ఇంటర్నెట్
సౌకర్యాలతో తీర్చిదిద్దటం జరుగుతుందన్నారు. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్
గా బాధ్యతలు తీసుకున్న వెంటనే గ్రంథాలయాల్లో పుస్తకాలు కొనుగోలుకు రూ. 15.56
కోట్లు మంజూరు చేయించటం జరిగిందని, వీటిలో ఇప్పటి వరకు రూ.10 కోట్లతో
పుస్తకాలను కొనుగోలు చేసి గ్రంధాలయాల్లో అందుబాటులో ఉంచటం జరిగిందన్నారు.
ఇటీవల 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నవంబరు 14తేదీ నుంచి 20 వరకు అన్నీ పౌర
గ్రంథాలయాలలో ఘనంగా నిర్వహించామని, వారోత్సవాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి
బొత్స సత్యనారాయణ రాష్ట్ర స్థాయిలో ప్రారంభించారన్నారు. వారోత్సవాల సంధర్భంగా
గ్రంథాలయాల్లో నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో 2,50,980 మంది విద్యార్ధులు
పాల్గొన్నారని, నూతనంగా 8,410 మంది గ్రంధాలయ సభ్యత్వం తీసుకున్నారన్నారు.
కరోనా విపత్తు వలన గ్రంథాలయాల్లో నిలిచిపోయిన కార్యక్రమాలను మరల తిరిగి
ప్రారంభిస్తున్నామని, విధ్యార్ధులకు పఠనాశక్తి పెంపోదించటానికి వేసవి
శెలవుల్లో శిక్షణ కార్యక్రమాల నిర్వహణ, చదవంటే మాకిష్టం కార్యక్రమం
సమర్ధవంతంగా నిర్వహించటం, మనం-మన గ్రంథాలయం కార్యక్రమం ద్వారా ప్రతి నెల మొదటి
శనివారం పాఠకులను, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి గ్రంథాలయ సంస్థ
పాలకవర్గ సభ్యులు, ఉద్యోగులతో గ్రంథాలయాలను అందంగా తీర్చిదిద్దే కార్యక్రమాలను
నిర్వహించటం జరుగుతుందని, నూతన పాఠకులను ఆహ్వనించేలా కార్యక్రమాలను
చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని పౌర గ్రంధాలయాలలో భవనాలు, సామాగ్రి
పరికరాలు వంటి మౌళిక సదుపాయాలను అభివృద్ది పరచడం, పత్రికలు మరియు పుస్తకాల
సరఫరాను పెంచడం. గ్రంధాలయ సేవలను మెరుగు పరిచేందుకు, వాటి అమలును కూడా
పర్యవేక్షించేందుకు దీర్గకాలిక, స్వల్పకాలిక ప్రణాళికలను తయారుచేయడమే
లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. అదే విధంగా రాష్ట్రంలో 2021-22 ఆర్ధిక
సంవత్సరంలో 17 గ్రంథాలయాల నిర్మాణానికి రూ. రూ.7,22,25,000/ మంజూరు చేశారని,
20 గ్రంధాలయ భవనాల మరమ్మత్తుల కోసం రూ.1,58,93,487/- మంజూరు చేశారని, 2022-23
ఆర్ధిక సంవత్సరంలో 15 గ్రంథాలయాల భవనాల నిర్మాణానికి రూ.5,11,20,000/-, 20
గ్రంధాలయాల భవనాల మరమ్మత్తులకు రూ.1,62,90,000/- నిధులు మంజూరు చేయటం
జరిగిందని పనులు వివిధ దశలలో కొనసాగుతున్నాయన్నారు. ఇప్పటికే పౌర
గ్రంథాలయాల్లో 22 రీడింగ్ హాల్స్ కు ఎయిర్ కండీషన్స్ చేయటం జరిగిందన్నారు.
మెరుగైన గ్రంథాలయ సేవలను అందించడం కోసం ఈ – గ్రంథాలయ సాఫ్ట్
వేర్ 3.0 వెర్షన్ ఏర్పాటు చేయబడిందని, రాష్ట్రం లోని 151 గ్రంథాలయాలలో ఈ –
గ్రంథాలయ సాఫ్ట్ వేర్ 4.0 వెర్షన్ ను అమలు చేయడానికి మరియు పౌర గ్రంథాలయాల శాఖ
కోసం వెబ్ సైట్ ను రూపొందించడానికి అనుమతి కోసం ప్రభుత్వానికి ప్రతిపాదన
సమర్పించామని తెలిపారు. రాజమహేంద్రవరం లోని శ్రీ గౌతమి ప్రాంతీయ గ్రంథాలయములో
30వేల ప్రాచీన గ్రంధాల డిజిటలైజేషన్ జరుగుతుందన్నారు. ఈ గ్రంధాలయంకు రాష్ట్ర
ప్రభుత్వం లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డును సైతం అందించి, రూ.10 లక్షల నగదు
బహుమతి అందించిందన్నారు. గ్రంథాలయ వ్యవస్థను బలోపేతం చేయటానికి రాష్ట్ర
గ్రంథాలయ పరిషత్ పాలకమండలి సభ్యలు, జిల్లా గ్రంథాలయ సంస్థల పాలకమండలి సభ్యులు,
గ్రంధాలయ సంస్థ ఉద్యోగులు కృషి చేస్తున్నారన్నారు.
రాష్ట్ర పౌర గ్రంథాలయాల శాఖ సంచాలకులు డా.ఎం.ఆర్ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ
అన్నీ జిల్లా కేంద్ర గ్రంథాలయాలకు బ్రిటిష్ లైబ్రరీ వంటి డిజిటల్ లైబ్రరీ యాప్
లు, వెబ్ సైట్ లను గ్రంథాలయ సభ్యత్వం ఉన్న చదువరులకు అందుబాటులో ఉంచటం
జరిగిందన్నారు. స్మార్ట్ ఫోన్స్ ద్వారా ఆన్ లైన్ లో డిజిటల్ గ్రంథాలయాలను
ఉపయోగించుకొనుటకు వీలుగా వైఫై కనెక్షన్ కూడా అందించబడుతుందన్నారు. పాఠశాల
విధ్యార్ధులకు పఠనాశక్తి పెంపోదించేందుకు గ్రంథాలయానికి 3 కి.మీ పరిధిలో ఉన్న
పాఠశాలలోని విద్యార్దులను గ్రంధాలయానికి మ్యాపింగ్ చేసి వారికి సభ్యత్వం
అందిస్తున్నామన్నారు. అదే విధంగా ప్రతి ప్రాధమిక, ఉన్నత పాఠశాలలో 300 నుంచి
500 పుస్తకాలతో సమగ్ర శిక్ష ద్వారా గ్రంధాలయాలు ఏర్పాటుకు చర్యలు
తీసుకుంటున్నామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర పౌర గ్రంథాలయాల శాఖ ఉప సంచాలకులు
పీర్ అహ్మద్, సహాయ సంచాలకులు దీక్షితులు, శర్మ, గ్రేడ్ 1 గ్రంధపాలకులు కె.
నాగరాజు పాల్గొన్నారు.