పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం
ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల ప్రచారంలో ఉపాధ్యాయులు పాల్గొనకూడదనే నిబంధన
ప్రజాస్వామ్య విరుద్ధం
జిల్లాల్లో ఉన్నతాధికారులు నియమించి ఓటర్ల జాబితాలు తనిఖీ చేయాలి, అనర్హులను
తొలగించాలి
సిపిఎం డిమాండ్
వెలగపూడి : వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన రాజకీయ
పార్టీల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్. బాబురావు,
కే.ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు జే.జయరాం పాల్గొని వినతిపత్రం
అందించారు. సమావేశంలో బాబురావు , ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల
చరిత్రలో ఏనాడు లేని విధంగా పట్టబద్రుల, ఉపాధ్యాయులు ఎన్నికల్లో ఓటర్లుగా
చేరిన సందర్భంలోనే డబ్బు పంపిణీ ప్రారంభించారు. ఎన్నికల తేదీ ప్రకటించకుండానే
ఓటర్ల చేర్పింపు సందర్భంలోనే డబ్బు ఇచ్చి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవటం
సిగ్గుచేటు. అధికార వైఎస్ఆర్ పార్టీ అన్ని విధాల అక్రమాలకు పాల్పడుతున్నది.
అధికార దుర్వినియోగం చేస్తోంది ఓటర్ల చేర్పింపు ముగింపులో 6 గంటల సమయంలో 75
వేల నుండి లక్ష ఓట్లు వరకు ఒకొక్క నియోజకవర్గంలో చేర్పించడం అక్రమాలకు అద్దం
పడుతోంది.
అర్హులైన ప్రభుత్వ టీచర్ల ఓట్లు జాబితాలో లేకుండా తొలగించారు, ఎటువంటి
సర్టిఫికెట్లు లేకుండా పట్టబద్రులు, టీచర్లు కాని వారిని అక్రమంగా ఓటర్ల
జాబితాలో పెద్ద ఎత్తున చేర్పించారు. కొంతమంది అధికారులు గుడ్డిగా అధికార
పార్టీ వారు అందించిన అక్రమ దరఖాస్తులపై సంతకాలు పెట్టడం గర్హనీయం. నకిలీ
డిగ్రీ సర్టిఫికెట్లు కూడా పెద్ద ఎత్తున సృష్టించారు. ఏనాడు లేనట్లుగా 40 శాతం
అదనంగా ఓట్లు అక్రమంగా చేర్పించారు. ఉపాధ్యాయ ఎన్నికల్లో కూడా ఉపాధ్యాయుల
ప్రచారం చేయకూడదని విద్యాశాఖ ఆదేశాలు జారీచేయటం రాజ్యాంగ విరుద్ధం. ఎన్నికల
కమిషన్ కు అనేక ఫిర్యాదులు చేసినా జిల్లాలలో అధికార యంత్రాంగం వాటిపై
స్పందించడం లేదు. సచివాలయ వ్యవస్థను రాజకీయ సాధనంగా మలుచుకుని ఓటర్ల
చేర్పింపుకు అధికార పార్టీ వినియోగించుకోవడం ఆక్షేపనీయం. ఓటర్ల జాబితాలను
ఉన్నత స్థాయి అధికారులు పూర్తిస్తాయిలో తనిఖీ చేయాలి. నకిలీ ఓటర్లను
తొలగించాలి. అర్హులైన వారిని ఓటర్లుగా నమోదు చేయాలి. సర్వీసు, డిగ్రీ
సర్టిఫికెట్లు ప్రతి ఒక్కరిది పారదర్శకంగా వెబ్ సైట్ లో ఉంచాలి. ఈ అక్రమాలను
అరికట్టకపోతే ప్రజాస్వామ్య ప్రక్రియకు తీవ్ర విఘాతం కలుగుతుంది. అధికార పార్టీ
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పట్టభద్రులు, మేధావుల్లో ఉన్న వ్యతిరేకతను ఎదుర్కోలేక
అక్రమాలు, అవినీతిపై ఆధారపడటం సిగ్గుచేటు. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా
వ్యవహరించి ఫిర్యాదులపై తక్షణం స్పందించాలి. అక్రమాలను అరికట్టాలి.
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు.