రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ
అమరావతి : మహిళలపై హింసను నిరోధించడానికి కఠిన శిక్షలు వేగంగా పడేవిధంగా దిశ
బిల్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రూపొందించడం జరిగిందని రాష్ట్ర మహిళా
కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. నవంబర్ 25 మహిళలపై హింస నివారణ
అంతర్జాతీయ దినంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా మంగళగిరి
కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ సన్నిహితుల నుంచే మహిళలపై హింస
ఎక్కువగా జరగడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న విషయమని ఐక్యరాజ్యసమితి
పేర్కొనడం జరిగిందన్నారు.నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5 నివేదిక ప్రకారం
దేశంలోని ప్రతి ముగ్గురు స్త్రీలలో ఒకరు వారి భర్తల నుంచి శారీరక, లైంగిక,
హింస ఎదుర్కొంటున్నట్లు వెల్లడైందన్నారు. కుటుంబ హింస, గృహహింస, పనిచేసే చోట
లైంగిక వేధింపులు అనేక సవాళ్ళ మధ్య మహిళలు ముందుకు అడుగులు వేస్తున్నారని
అన్నారు. మహిళల చుట్ట ఉన్న ప్రపంచాన్ని, కుటుంబం, సమాజం మార్చకుండా మహిళలపై
హింసను ఆపలేమన్నారు. స్వాతంత్ర భారత దేశంలో ఇప్పటివరకు ఎక్కడ జరిగిన విధంగా
మహిళ సాధికారిత దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తుందన్నారు. సంక్షేమ పథకాలలో
మహిళలకు ప్రాధాన్యత ,50 శాతం రిజర్వేషన్లు అమలు, 30 లక్షల మందికి ఇళ్ల పట్టాల
పంపిణీ చేయడం జరిగిందన్నారు. చారిత్రాత్మక నిర్ణయాలతో మహిళలకు ఇంట, బయట
కీలకమైన వ్యక్తులుగా సమాజంలో గుర్తింపు వచ్చే విధంగా సీఎం జగన్ కృషి
చేస్తున్నారన్నారు. దిశా యాప్ ద్వారా అరచేతిలో మహిళలకు రక్షణ వ్యవస్థను
అందుబాటులో ఉంచడం ఒక గొప్ప ముందడుగు అన్నారు. ఆపదలో ఉండే మహిళలకు భరోసా
ఇవ్వటంతో పాటు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు దిశ యాప్
ఉపయోగపడుతుందన్నారు. నేరం జరిగిన వారం రోజుల్లో చార్జిషీటు దాఖలు చేయటం, అతి
త్వరగా శిక్షలు పడే విధంగా దిశ చట్టం తీసుకురావడం జరిగిందన్నారు. ఆడబిడ్డలను
కంటికి రెప్పలా చూసుకునే ప్రతి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని పేర్కొన్నారు.
ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి తోడుగా సమాజం, ప్రతి కుటుంబం, మహిళలకు రక్షణ
కవచంగా మారే చైతన్యం రావాలని కోరారు.