హరినామ స్మరణ నడుమ భక్తుల కోలాహలం
దైవారాధనతోనే భగవంతుడు అనుగ్రహం
సింహాచలం : దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న
సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నృసింహ స్వామి ఆలయంలో శుక్రవారం సింహాద్రినాథుడి
నృసింహ దీక్షలు ఘనముగా ప్రారంభించారు.. అంగరంగ వైభవంగా జరిగిన ఈ నృసింహ
దీక్షల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భక్తుల హరినామ స్మరణల నడుమ సింహగిరి
పులకరించింది. ఏకధాటిగా కురిసిన భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నృసింహ
దీక్షలు ధరించేందుకు పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.
తొలుత ఆలయ స్థానాచార్యులు టి పి రాజగోపాల్, పురోహితులు కరి సీతారామాచార్యులు,
ఇతర అర్చక పరివారం, సహాయ కార్య నిర్వహణ అధికారి నరసింహారాజు, ఆలయ ధర్మ కర్తల
మండలి సభ్యులు గంట్ల శ్రీను బాబు , పలు భజన మండళ్లకు చెందిన భక్త బృందం అంతా
తులసి మాలలతో, స్వామి రాగి డాలర్ లు, పూజా ద్రవ్యాలు తదితర సామగ్రి కి
గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదమంత్రోచ్చరణలు, మృదు మధుర మంగళ
వాయిద్యాలు నడుమ మాలలకు మంగళహారతులు ఇచ్చారు. అనంతరం ఆలయ రాజగోపురం ఎదురుగా
ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై తొలుత సింహాద్రినాధుడికి పూజలు చేశారు.
పురోహితులు కరి సీతారామచార్యులు,శ్రీ కాంత్ ,తదితరులు ప్రత్యేక అర్చన
గావించారు. తదుపరి అప్పన్న అష్టోత్తరం భక్తులతో స్మరింపచేశారు.
దైవరాధనతోనే భగవంతుడు అనుగ్రహం : దీక్షాపరులను ఉద్దేశించి ఆలయ స్థానాచార్యులు
టి పి రాజగోపాల్ అనుగ్రహ భాషణం చేశారు. మాలలు ధరించిన భక్తులంతా నియమ నిష్ఠలతో
దీక్షా కాలాన్ని పూర్తి చేయాలన్నారు. దీక్షలు చేపట్టిన సమయంలోనే కాకుండా
ఎల్లప్పుడూ నరసింహస్వామిని సేవించి వేడుకోవాలి అన్నారు. భక్తులు పిలిస్తే
పలికే స్వామి అన్నింటా కొలువు ఉన్నా డన్నారు .భక్తులు పిలవగానే ప్రత్యక్షం
అయ్యే స్వామి , భక్తులు పిలవగానే ప్రత్యక్షం అయ్యే స్వామి నృసింహుడన్నారు..
పిల్లలకు దేవుడి పేర్లు పెట్టుకునే అలవాటు మరింతగా పెరగాలన్నారు.దీనివల్ల
వృద్ధాప్యంలో పిల్లల పేర్లు పెట్టి పిలుచుకుంటే అది భగవంతుడుని పిలిచినట్టుగా
స్వామి చెంతకు చేరుతుందన్నారు. ఒడిస్సా, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు
చెందిన భక్తులు పెద్ద ఎత్తున భక్తులు మాలలు ధరించడం అభినందనీయం అన్నారు.
భవిష్యత్తులో వీటి సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందన్నారు. అయితే భగవంతుని
దృష్టిలో అందరూ సమానమని, వర్గ విభేదాలు లేకుండా ఐకమత్యంగా అందరు నృసింహ
దీక్షలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు
గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ నృసింహ దీక్షలు చేపట్టేందుకు వందలాది మంది
భక్తులు తరలిరావడం స్వామి పై భక్తిశ్రద్ధలే ప్రధాన కారణం అన్నారు. నరసింహా
స్వామిని సేవించుకుంటే భక్తుల కు ఎటువంటి కష్టమైనా క్షణాల్లో తొలగిపోతుంది
అన్నారు. ఇటువంటి పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం రావడం తన పూర్వ జన్మ
సుకృతంగా భావిస్తున్నట్లు శ్రీను బాబు చెప్పారు. పలు పీఠాలకు చెందిన
నిర్వాహకులు, భక్తులు భారీగా పాల్గొని నృసింహ దీక్ష శరణుతో సింహగిరిని మారు
మ్రోగించారు. సింహాచలం దేవస్థానం అధికారులు దీక్షాపరులకు ఎటువంటి ఇబ్బందులు
లేకుండా అన్ని ఏర్పాట్లు చేసారు. ఆలయ సూపరింటెండెంట్ పిల్లా శ్రీను, ఇంఛార్జి
ఈఈ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.నృసింహ దీక్షలు సందర్భముగా కొందరు భక్తులు
స్వామి, ప్రహ్లాద వేష ధారణ గావించారు.