పరీక్షించుకోనున్నఅభ్యర్థుల్లో గతంతో పోల్చుకుంటే నేరచరిత్ర కలిగిన వారు
ఎక్కువ మంది ఉన్నారని ప్రజాస్వామ్య సంస్కరణ సంఘం తాజాగా వెల్లడించింది. అయితే
బీజేపీలో నేరచరిత అభ్యర్థుల సంఖ్య తగ్గినట్లు తెలిపింది. గుజరాత్ అసెంబ్లీ
ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతుండటంతో వివిధ పార్టీలు ప్రచారంలో తలమునకలై
ఉన్నాయి. ప్రత్యర్థి పార్టీలను పడగొట్టేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి.
వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థుల పేర్లను ఖరారు చేశాయి. అయితే
డిసెంబరు 1న జరగనున్న తొలివిడత పోలింగ్‌కు సంబంధించి గతంతో పోల్చుకుంటే ఎక్కువ
మంది అభ్యర్థులు నేరచరిత్ర ఉన్నవారేనని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం
(అసోసియేషన్ ఆప్ డెమొక్రటిక్ రిఫార్మ్స్) తాజాగా వెల్లడించింది. వీరి
సంఖ్య అత్యధికంగా ఆమ్ఆద్మీ పార్టీలో ఉందని పేర్కొంది. ఈసారి బీజేపీ
అభ్యర్థుల్లో నేరచరితులు తగ్గినట్లు పేర్కొంది. కాంగ్రెస్‌లో దాదాపు ఎలాంటి
మార్పూ లేదని చెప్పింది.
2017 అసెంబ్లీ ఎన్నికలను కూడా రెండు విడతల్లో నిర్వహించారు. తొలివిడతలో నేర
చరిత్ర కలిగిన అభ్యర్థులు 15శాతం ఉండగా.. తాజా ఎన్నికల్లో అది 21 శాతానికి
పెరిగినట్లు ఏడీఆర్ పేర్కొంది. ఆప్ నుంచి పోటీ చేస్తున్న వారిలో 36 శాతం
మందికి నేరచరిత్ర ఉన్నట్లు ఏడీఆర్ తన నివేదికలో పేర్కొంది. దాదాపు 35 శాతం
మంది కాంగ్రెస్ అభ్యర్థులు తమకు నేర చరిత్ర ఉన్నట్లు అఫిడవిట్లో తెలిపారు.
మరోవైపు 2017 ఎన్నికల్లో నేరచరిత్ర కలిగిన బీజేపీ అభ్యర్థుల సంఖ్య 25శాతం
ఉండగా తాజా ఎన్నికల్లో 16 శాతానికి చేరింది.
అభ్యర్థుల ఎంపికపై గతంలో సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలను గుజరాత్
ఎన్నికల్లో ఏ రాజకీయపార్టీ కూడా పాటించలేదు. ఎప్పటిలాగే, వారివారి సమీకరణాల
ప్రకారం అభ్యర్థుల ఎంపిక చేపట్టాయి.గుజరాత్ తొలివిడత ఎన్నికల్లో ఒక్కో పార్టీ
16శాతం నుంచి 36 శాతం వరకు నేరచరిత్ర కలిగిన వారినే అభ్యర్థులుగా ఎంపిక
చేశారు.’’ అని ఏడీఆర్ ఛైర్మన్ రిటైర్డ్ మేజర్ జనరల్ అనిల్ వర్మ
తెలిపారు. నేరచరిత్ర కలిగిన వారిని ఏ పార్టీలూ అభ్యర్థులుగా ప్రకటించకూడదని,
ఒకవేళ ప్రకటిస్తే నేర చరిత్రలేని అభ్యర్థులను కాదని ఎందుకు అలా చేయాల్సి
వచ్చిందో కారణాలు వెల్లడించాలని 2020, ఫిబ్రవరి 13న సుప్రీం కోర్టు అన్ని
రాజకీయ పార్టీలను ఆదేశించింది. సుప్రీం ఆదేశాలను పక్కన పెట్టి అభ్యర్థుల ఎంపిక
చేపట్టడం వివాదాలకు తావిస్తోంది.