పూర్తిగా విఫలమైందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. అందుకే
అటవీ శాఖ అధికారులు, పోడు భూముల సాగు చేసుకుంటున్న గిరిజనుల మధ్య నిత్యం
గొడవలు జరుగుతూనే ఉన్నాయన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫారెస్ట్
రేంజ్ అధికారి (ఎఫ్ఆర్వో) చలమల శ్రీనివాసరావు గుత్తికోయల దాడిలో హత్యకు
గురికావడం చాలా దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనంతోనే ఒక అధికారి
ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. శ్రీనివాసరావుది ముమ్మాటికీ ప్రభుత్వ
హత్యేనని ఆరోపించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు రేవంత్ బహిరంగ లేఖ రాశారు.
‘‘పోడు భూములపై హక్కులు కల్పిస్తామని గత ఎనిమిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం
లబ్ధిదారులను ఊరిస్తూ వస్తోంది. మరోవైపు అటవీ భూములను సేద్యం చేస్తున్నారని
గిరిజనులపైకి అధికారులను ఎగదోస్తూ చోద్యం చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ
నిర్వాకం వల్ల తెలంగాణ వచ్చినప్పటి నుంచి అటవీ శాఖ అధికారులు, గిరిజనుల మధ్య
నిత్యం ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. పోడు భూముల్లో ఫారెస్ట్ ఆఫీసర్లు మొక్కలు
నాటేందుకు రావడం..గిరిజనులు అడ్డుకోవడం..వారి మధ్య గొడవలు జరగడం పరిపాటిగా
మారింది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది గిరిజనులపై కేసులు
పెట్టారు. పోడు భూములు సాగు చేస్తోన్న రైతులు పోరాటాలు, ఉద్యమాలు చేసినా
ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. పోడు భూములకు పట్టాలిస్తాం అని
అసెంబ్లీలో ప్రకటన చేసి మూడేళ్లు గడిచింది. పోడు సమస్య పరిష్కారానికి గతేడాది
సెప్టెంబర్ 16న మంత్రి సత్యవతి రాథోడ్ ఛైర్ పర్సన్‌గా ఒక కమిటీని నియమించారు.
కమిటీని నియమించి దాదాపు 14 నెలలైనా ఇంత వరకు అతీగతీ లేదు. అధికారులు అభద్రతా
భావంతో విధులు నిర్వహించాల్సిన దుస్థితి వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు
తెరవాలి’’ అని రేవంత్ పేర్కొన్నారు.