ప్రచారక్‌ల జోలికి వస్తే ఖబడ్దార్
కుమార్తె, కొడుకుల కుంభకోణాల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నం
ఏ సంక్షేమ పథకాన్నీ రద్దు చేయం
తెరాసకు బినామీగా కాంగ్రెస్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
హైదరాబాద్ : నోటీసుల పేరుతో ప్రచారక్‌ల జోలికి వస్తే సహించేది లేదని బీజేపీ
రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. బీజేపీ జాతీయ సంస్థాగత
వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఏం తప్పు చేశారని నోటీసులిచ్చారో
చెప్పాలని డిమాండ్ చేశారు. శామీర్‌పేటలో మూడ్రోజుల పాటు జరిగిన బీజేపీ
శిక్షణ శిబిరం ముగింపు సందర్భంగా సంజయ్ మాట్లాడారు. కుమార్తె, కొడుకు,
ఎమ్మెల్యేల కుంభకోణాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు సీఎం కేసీఆర్
ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మిగులు బడ్జెట్, ధనిక రాష్ట్రంగా ఉన్న
తెలంగాణను రూ.5 లక్షల కోట్ల అప్పులపాలు చేసి ప్రతి వ్యక్తిపై రూ.1.20 లక్షల
రుణభారం మోపారన్నారు. కేసీఆర్‌కు ప్రజలు ఇంకోసారి అవకాశం ఇస్తే మరో రూ.5 లక్షల
కోట్ల అప్పులు చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో భాజపాకు
ఒక్క అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తిచేశారు. అభివృద్ధి చెందిన
తెలంగాణగా మారుస్తామని, ఉద్యమ ఆకాంక్షల్ని నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.
బండి సంజయ్ భావోద్వేగం : ‘ప్రచారక్‌లు ఫాంహౌస్, ప్రగతిభవన్లలో ఉండేవాళ్లు
కాదు. కుటుంబ, వివాహ బంధాలను త్యజించి దేశం, ధర్మం కోసం పనిచేస్తారు. అంతమంచి
ప్రచారక్ వ్యవస్థను కించపరుస్తారా? బీఎల్ సంతోష్‌కు బ్యాంకు ఖాతాలు,
విదేశాల్లో పెట్టుబడుల్లేవు. ఆయన ఎంపీ, ఎమ్మెల్యే కావాలని అనుకోలేదు. కుట్ర
రాజకీయాలతో బీజేపీ ని అడ్డుకోలేరు’ అంటూ సంజయ్ భావోద్వేగంగా మాట్లాడారు. ఆయన
ఒకింత కన్నీటి పర్యంతం అయ్యారు. కొందరు కార్యకర్తలూ కంటతడి పెట్టారు.
ఏ సంక్షేమ పథకాన్నీ రద్దు చేయం : అభివృద్ధి చేసిందేం లేక, ఎన్నికల్లో
ఓటమిభయంతో ప్రధానమంత్రిని కేసీఆర్ తిడుతున్నారు. నా యాత్రను అడ్డుకునేందుకూ
కుట్ర చేస్తున్నారు. కేసీఆర్ పాలనకు కౌంట్‌డౌన్ మొదలైంది. ఎన్నికలు
ఎప్పుడొచ్చినా ఎదుర్కొంటాం. అధికారంలోకి వచ్చాక ఏ సంక్షేమ పథకాన్నీ రద్దు
చేయబోమని సంజయ్ అన్నారు.
తెరాసకు బినామీగా కాంగ్రెస్ : ‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తెరాసకు
బినామీగా మారింది. ఆ పార్టీ దిల్లీలో లేదు. గల్లీలో లేదు. వాళ్లే పార్టీని
కూల్చుకుంటున్నారు. కార్మికుల పక్షాన పోరాడుతామని చెప్పే కమ్యూనిస్టులు తమ
సిద్ధాంతాలను సీఎం దగ్గర తాకట్లు పెట్టారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని
ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు తెరాసతో కలిసేందుకు సిద్ధం
అవుతున్నాయి. మునుగోడులో ఆయా పార్టీలన్నీ కలిసినా 10 వేల ఓట్లకు మించి
మెజారిటీ రాకపోవడంతో కేసీఆర్ గందరగోళంలో పడ్డారు. కేసీఆర్ పాలన బోర్డు
తిప్పేసిన ఫైనాన్స్ సంస్థలా ఉందని సంజయ్ విమర్శించారు. సమావేశంలో డీకే అరుణ,
సోయం బాపురావు, ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, విజయశాంతి, వివేక్
వెంకటస్వామి, జితేందర్‌రెడ్డిలు సహా పలువురు భాజపా నేతలు పాల్గొన్నారు.