నాకు ఎలాంటి హోదా లేదు.. నేను ప్రజల సేవకుణ్ని
ప్రధాని నరేంద్ర మోడీ
గుజరాత్ : ప్రజలు అధికారానికి దూరం చేసిన పార్టీని తిరిగి అధికారంలోకి
తీసుకొచ్చేందుకు దేశంలో యాత్రలు చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ
విమర్శించారు.గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని, రాహుల్ జోడో
యాత్రను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నో ఏళ్ల క్రితం అధికారానికి
దూరమైన కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకే రాహుల్ గాంధీ
భారత్ జోడో యాత్ర చేస్తున్నారని ప్రధాని మోదీ విమర్శించారు. గుజరాత్
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సురేంద్రనగర్ ప్రాంతంలో నిర్వహించిన సభలో
ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు.
ఈ రాష్ట్రంలో తయారైన ఉప్పు తిని కొందరు గుజరాత్‌పైనే విమర్శలు చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ఉప్పులో 80 శాతం గుజరాత్‌లోనే తయారవుతోందని
అన్నారు.
ఎన్నో ఏళ్ల క్రితమే ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారానికి దూరంచేశారు.
కానీ, ఆ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు కొందరు పాదయాత్రలు
చేస్తున్నారు. ఈ యాత్రలో నర్మదా ప్రాజెక్ట్‌ను 40 ఏళ్లపాటు అడ్డుకున్న
వ్యక్తులతో కలిసి నడుస్తున్నారని రాహుల్‌ను ఉద్దేశించి ప్రధాని విమర్శలు
చేశారు. కొద్దిరోజుల క్రితం మహారాష్ట్రలో నర్మదా బచావో ఆందోళన్ నాయకురాలు
మేధా పాట్కర్, రాహుల్ గాంధీతో కలిసి జోడో యాత్రలో పాల్గొన్నారు.
‘‘కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి గురించి మాట్లాడకుండా మోడీకి
తామెంటో చూపిస్తామని ప్రచారం చేస్తున్నారు. అది వారి అహంకారానికి నిదర్శనం.
కానీ, నాకు ఎలాంటి హోదా లేదు.. నేను ప్రజల సేవకుణ్ని’’ అని ప్రధాని
వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీ , కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ,
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గుజరాత్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో
పాల్గొననున్నారు. డిసెంబరు 1, 5 తేదీల్లో రెండు విడతల్లో అసెంబ్లీ ఎన్నికల
పోలింగ్ జరగనుంది. డిసెంబరు 8న ఫలితాలు వెల్లడించనున్నారు.