మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్
నరసన్నపేట : రాష్ట్రంలో భూ తగాదాలు లేని గ్రామాలను త్వరలోనే చూస్తామని మాజీ ఉప
ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్
అన్నారు. వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష (రీ సర్వే) పథకంలో భాగంగా
జిల్లాలో భూ రికార్డుల పంపిణీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 23న
శ్రీకారం చుడుతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను
పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ఆయన సోమవారం మధ్యాహ్నం పరిశీలించారు. రాష్ట్రంలో
మొదటిసారిగా జగ్గయ్యపేట తక్కెళ్ళపాడులో భూ సర్వే కార్యక్రమాన్ని తాను
రెవెన్యూ మంత్రిగా ఉండగా ప్రారంభించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని
అన్నారు. మొదటి విడతలో రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నామని
రెండో విడతకు సంబంధించి నరసన్నపేట నియోజకవర్గంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం
చుడతామని చెప్పారు. రూ.1000 కోట్ల ఖర్చుతో రాజకీయాలకు అతీతంగా ఈ
కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్ని పార్టీలు అన్ని కులమత వర్గాలు హర్షించే
విధంగా దీనిని కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి
ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరై తమ
హర్షాన్ని తెలియజేసి జగన్మోహన్ రెడ్డిని దీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, పాతపట్నం శాసనసభ్యురాలు రెడ్డి శాంతి, జిల్లా
పరిషత్ చైర్మన్ పిరియా విజయ, మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి డిసిసిబి
అధ్యక్షులు కరిమి రాజేశ్వరరావు, కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ అందవరపు
సూరిబాబు, యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య, స్థానిక ప్రజా
ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు