విజయవాడ : పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల మెడికల్ బిల్లులను వెంటనే చెల్లించాలని
ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి
, ఫోర్‌తో చైర్మన్ కరణం హరికృష్ణ , సెక్రటరీ జనరల్ సామల సింహాచలం లు సోమవారం
ఒక ప్రకటనలో డిమాండు చేశారు. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా దాదాపు
రూ.10 కోట్ల బిల్లులు పెండింగులో ఉన్నాయన్నారు. ఉపాధ్యాయులు వివిధ అనారోగ్య
కారణాలతో లక్షలాది రూపాయలు ఆసుపత్రుల్లో ఖర్చుచేసి బిల్లుల మంజూరు కోసం ఎదురు
చూస్తుండగా అధికారులు వారి సమస్య గురించి పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.
అన్నిశాఖల ఉద్యోగులకు బిల్లులు చెల్లించి ఉపాధ్యాయుల బిల్లులు మాత్రం జీవో
సంఖ్య 74 సాకుగా చూపి పెండింగ్ లో పెట్టడం భావ్యం కాదన్నారు. కావున గత 11
నెలలుగా పాఠశాల విద్యాశాఖ కమీషనర్ వద్ద పెండింగ్ లో ఉన్న మెడికల్ బిల్లులను
చెల్లించాలని వారు కోరారు.