ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్, దివంగత కొణిజేటి రోశయ్య
జ్ఞాపకార్థం బాపట్లలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం వైసీపీ
ప్రభుత్వం ఆర్ధిక సాయం ప్రకటించింది. రోశయ్య సొంతూరైన బాపట్లలోని వేమూరు
గ్రామంలో ఆయన కాంస్య విగ్రహ ఏర్పాటు కోసం రూ.10 లక్షలు విడుదల చేస్తూ
ఉత్తర్వులు జారీ చేసింది.
వేమూరులో రోశయ్య విగ్రహ ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి.
వైసీపీ కి చెందిన ఆర్యవైశ్య నేతలు ఈ మేరకు ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తిని
జగన్ సర్కార్ ఆమోదించింది. ఈ మేరకు సాంస్కృతిక వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ
చేసింది. ఇందులో వేమూరులో రోశయ్య కాంశ్య లేదా ఇత్తడి విగ్రహ ఏర్పాటు కోసం
రూ.10 లక్షలు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రజత్ భార్గవ
పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని సాంస్కృతిక శాఖ ఖాతా నుంచి విడుదల చేయనున్నట్లు
ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
వాస్తవానికి జగన్ తండ్రి వైఎస్ ఆకస్మిక మరణం తర్వాత ప్రభుత్వంలో ఆయన తర్వాత
రెండోస్థానంలో ఉన్న రోశయ్య ను అప్పటి కాంగ్రెస్ అధిష్టానం సీఎంగా
ప్రకటించింది. సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి ఆయన పేరును ప్రకటించేలా జగన్ ను
కూడా ఒప్పించింది. అయితే, వైఎస్ స్థానే జగన్ ను సీఎంగా చేసేందుకు కాంగ్రెస్
ఎమ్మెల్యేలు అప్పటికే సంతకాల సేకరణ కూడా ప్రారంభించారు.ఈ క్రమంలో కాంగ్రెస్
అధిష్టానం నిర్ణయం వారితో సహా జగన్ కు రుచించలేదు. దీంతో తన తండ్రి మరణంతో
చనిపోయిన వారిని ఓదార్చేందుకు జగన్ ఓదార్పుయాత్ర తలపెట్టారు. దీనికి కూడా
అధిష్టానం అనుమతించలేదు. రోశయ్య ప్రభుత్వాన్ని అస్ధిర పరిచేందుకే జగన్ ఇలా
చేస్తున్నారని అది భావించింది. దీంతో రోశయ్య సాయంతోనే జగన్ ను కట్టడి చేసే
ప్రయత్నం చేసింది. దీంతో జగన్ కూ, రోశయ్యకూ మధ్య గ్యాప్ పెరిగింది. అయితే
రోశయ్య జగన్ కు వ్యతిరేకంగా తీవ్ర చర్యలేవీ తీసుకోలేదు. చివరికి ఈ గ్యాప్
అలాగే వుండిపోయింది. రోశయ్య మరణం తర్వాత ఆయన మృతదేహాన్నిజగన్ సందర్శించలేదని
ప్రతిపక్షాలు నానా యాగీ చేశాయి. ఈ నేపథ్యంలో రోశయ్య విగ్రహానికి నిధుల విడుదల
ప్రాధాన్యం సంతరించుకుంది.