శుభాకాంక్షలు
విజయవాడ : పాత్రికేయులు కలం బలంతో తమ గళం వినిపించేవారని, సమాజ రుగ్మతలు
తొలగించే ఆధునిక వైద్యులని, ప్రజలను చైతన్యవంతులను చేయగల సమర్థులని మంత్రి
జోగి రమేష్ కొనియాడారు. పత్రికలు కేవలం సమాచార సాధనాలు మాత్రమే కాదని, అవి
ఒకనాటి విజ్ఞాన వీచికలని, ఉద్యమ వాహకాలు మరియు చైతన్య దీపికలే కాకుండా ప్రజలకు
అండగా నిలిచే ఆయుధాలని మంత్రి జోగి రమేష్ అభిప్రాయపడ్డారు. దేశంలో ప్రతి
సంవత్సరం నవంబర్ 16న జాతీయ పత్రికా దినోత్సవం జరుపుకుంటారని మంత్రి
పేర్కొన్నారు. భారత దేశంలో ఒక స్వతంత్ర, బాధ్యతాయుతమైన పత్రికా రంగం ఉనికికి
గుర్తుగా ఉంటుందని, భారతదేశంలో పత్రికా స్వేచ్ఛను పరిరక్షించే లక్ష్యంతో,
జర్నలిజంలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పే లక్ష్యంతో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్
ఇండియాని ఏర్పాటు చేశారని మంత్రి జోగి రమేష్ గుర్తుచేశారు. అదే సమయంలో పెడన
నియోజకవర్గ పరిధిలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పని చేస్తున్న
పాత్రికేయ సోదరులకు తాను అన్ని విధాలా అండగా ఉంటానని మంత్రి హామీ ఇచ్చారు.
ప్రభుత్వం నుంచి వారికి లభించే ప్రోత్సాహకాలు పొందేలా తాను వారి పక్షాన
ఉంటానని తెలిపారు. ఎప్పుడు, ఏ సమయంలో, ఎలాంటి ఇబ్బందులు ఏర్పడినా తనను వెంటనే
వ్యక్తిగతంగా సంప్రదించాలని సూచించారు. సీఎం జగన్ నేతత్వంలోని రాష్ట్ర
ప్రభుత్వం అందిస్తున్న జనరంజక పరిపాలన ప్రజల్లోకి మీడియా మిత్రులు బలంగా
తీసుకెళ్లాలని మంత్రి జోగి రమేష్ ఆకాంక్షించారు.