న్యూఢిల్లీ : దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన ఓ సర్వే ప్రకారం ప్రతి
ఐదుగురు బాల వధువుల్లో ముగ్గురు గర్భం దాలుస్తున్నారు. ఈ సర్వేలో బాల్య
వివాహాల గురించి కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటంటే?
దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన ఓ సర్వే ప్రకారం ప్రతి ఐదుగురు బాల
వధువుల్లో ముగ్గురు గర్భం దాలుస్తున్నారు. చైల్డ్ రైట్స్ అండ్ యూ
(కేఆర్వై/క్రై) అనే స్వచ్ఛందసంస్థ ఈ సర్వే నివేదికను వెల్లడించింది. యుక్త
వయసు రాకముందే తల్లులుగా మారుతున్న బాల్య వివాహాలతో బాలికల లైంగిక,
పునరుత్పాదక ఆరోగ్యంపై హానికరమైన ప్రభావం పడుతున్నట్లు తెలిపింది. బాలల
దినోత్సవంతోపాటు బాలల సంరక్షణ వారోత్సవాల (నవంబర్ 14 – 20) నేపథ్యంలో ఈ
అధ్యయనం చేశారు. చిత్తూరు (ఆంధ్రప్రదేశ్), చందౌలీ (ఉత్తర్ప్రదేశ్), పర్భణీ
(మహారాష్ట్ర), కంధమాల్ (ఒడిశా) జిల్లాల్లోని 8 బ్లాకుల నుంచి 40 గ్రామాలను
ఎంపిక చేసుకొని ఈ సర్వే నిర్వహించారు. ఈ అధ్యయనం ప్రకారం.. కేవలం 16 శాతం
తల్లిదండ్రులు, అత్తామామలు, 34 శాతం బాల వధూవరుల్లో మాత్రమే బాల్య వివాహాల
దుష్పరిణామాలపై అవగాహన ఉన్నట్లు తేల్చారు. కడు పేదరికం, తప్పని వలసలు, లింగ
అసమానతలు ఇటువంటి వివాహాలకు కారణమవుతున్నట్లు వెల్లడైంది. బాలురతో పోల్చితే
విద్యకు అవకాశాలు, ఆర్థిక స్థోమత లేకపోవడం వంటి కారణాల వల్ల కూడా బాలికలు
డ్రాపవుట్లుగా మారుతున్నారు.
ఆంధ్రప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో గతంతో పోల్చుకుంటే బాల్య
వివాహాల సంఖ్య తగ్గినా, ఇప్పటికీ ప్రబలంగానే ఉన్నట్లు తేలింది.
ఆంధ్రప్రదేశ్లో ఈ వివాహాల సంఖ్య ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉంది. బాల్య
వివాహాల్లో జాతీయ సగటు వయసు 16.5 ఏళ్లు ఉండగా ఆంధ్రప్రదేశ్లో ఇది 16.6
సంవత్సరాలుగా ఉంది. ఉత్తర్ప్రదేశ్లో 16.3, ఒడిశాలో 16.5, మహారాష్ట్రలో 17
ఏళ్లుగా ఉన్నట్లు గుర్తించారు. 15 – 19 సంవత్సరాల మధ్య తల్లులుగా, గర్భవతులుగా
ఉన్న మహిళలు ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా (12.5 శాతం) ఉన్నారు. కరోనా వంటి
మహమ్మారులు ప్రజలను ఇంకా దుర్బలత్వంలోకి నెట్టేశాయని, మహిళా విద్య, జీవన
ప్రమాణాల మెరుగుదల ఈ సమస్యకు పరిష్కారం చూపగలవని ‘క్రై’ సంస్థ సీఈవో పూజా
మర్వాహ తెలిపారు.