విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ కి మోడీ చేసే మోసాలనే కాదు. న్యాయబద్దంగా
రావాల్సిన హక్కులు అడిగే దైర్యం ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ, జనసేన
పార్టీలనేతలకు పోయిందని ఎపీసీసీ అధ్యక్షులు సాకే శైలజనాథ్ అన్నారు.
విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా
సమావేశంలో శైలజనాథ్ మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడే వాళ్లు,
ఆలోచించే పార్టీ అంటూ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రానికి
సంబంధించి బిజెపి, జనసేన వాళ్ళకి తెలియని సమాచారమంతా వైసిపి దగ్గర ఉంటుందని,
విశాఖపట్నం మీద వాలిన విజయ సాయిరెడ్డిని దగ్గర మరింత సమాచారం ఉంటుందని
ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎపి కి మేలు జరగాలంటే బిజెప దుర్మార్గాన్ని
అడ్డుకోవాలని, అది కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక
హోదా, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటు పరం, ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు
ప్రత్యేక ప్యాకేజీ ల విషయంలో మోసం చేశారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా పై
హామీ ఇచ్చి రావాలని మోడీ ని డిమాండ్ చేశామని, కానీ దానిపై వైసీపీ కనీసం నోరు
విప్పలేదన్నారు.