గుజరాత్ రాజకీయం రసవత్తరంగా మారింది. మోడీ ప్రజాకర్షణ శక్తే ప్రధాన అస్త్రంగా
బీజేపీ బరిలోకి దిగుతోంది. నాయకత్వ లేమితో కాంగ్రెస్ సతమతం అవుతుండగా త్రిముఖ
పోరులో ఆప్ ప్రభావం ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది. సాధారణంగా రెండు పార్టీల
మధ్య ఎన్నికల పోరు జరిగే గుజరాత్లో ఈ దఫా ముక్కోణపు పోటీకి తెరలేచింది.
కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ రంగంలోకి దిగాక ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సొంత
రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. త్రిముఖ పోరులో అసెంబ్లీ ఎన్నికల
ఫలితాలు గతంలోకంటే ఏమైనా భిన్నంగా ఉంటాయా అనే విశ్లేషణ మొదలైంది.
నరేంద్ర-భూపేంద్ర
2017 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 49.05 శాతం ఓట్లతో 99 సీట్లు, కాంగ్రెస్
41.44శాతం ఓట్లతో 77సీట్లు గెలుచుకున్నాయి. తర్వాత కాంగ్రెస్ నుంచి వలసలతో
బీజేపీ బలం 111కి పెరిగింది. అధికార పక్షం మోడీ విజయాలు, అభివృద్ధిపై ఆధారపడి
ముందుకెళ్తుంటే, ప్రతిపక్షాలు రాష్ట్రంలో బీజేపీ సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ
ఓటర్లను ఆకర్షించాలని చూస్తున్నాయి. రాష్ట్రంలో 1995 నుంచి బీజేపీ ప్రభుత్వాలు
మొదలయ్యాయి. 1996 నుంచి ఏడాదిన్నర పాటు మినహా 1998 నుంచి భాజపా ప్రభుత్వాలు
నిరాటంకంగా కొనసాగుతున్నాయి. 14 నెలల క్రితం విజయ్‌రూపాణీని తొలగించి తొలిసారి
ఎమ్మెల్యే అయిన పటేల్ వర్గానికి చెందిన భూపేంద్ర రజినీకాంత్ పటేల్‌ను
ముఖ్యమంత్రి పీటం మీద బీజేపీ కూర్చోబెట్టింది. డబుల్ ఇంజిన్
(నరేంద్ర-భూపేంద్ర) నినాదంతో బీజేపీ ఎన్నికల శంఖం పూరిస్తూ ఉత్సాహంగా ముందడుగు
వేస్తోంది. మోడీ తప్ప మిగతా విషయాలకేమీ ప్రాధాన్యంలేదన్నట్లు వ్యవహరిస్తూ
ఎన్నికలకు వెళ్తోంది. అందుకే రాష్ట్రంలో బీజేపీ కి ఆయనే సర్వాంతర్యామిగా
కనిపిస్తున్నారు.
కాంగ్రెస్‌కు నాయకత్వ లేమి
వ్యూహకర్త అహ్మద్‌పటేల్ రెండేళ్ల క్రితం మరణించడంతో కాంగ్రెస్ పార్టీకి
రాష్ట్రంలో మార్గనిర్దేశం చేసే సీనియర్లు కరువయ్యారు. పీసీసీ అధ్యక్షుడు
జగదీశ్ ఠాకుర్ బలం చాలడం లేదు. సీనియర్ నేత రాహుల్‌గాంధీ భారత్ జోడో
యాత్రలో మమేకం కావడంతో ఇక్కడ ప్రచారం చేసే పరిస్థితి కనిపించడంలేదు.
రాష్ట్రంలోని 182 సీట్లకుగాను 66 పట్టణ, శివారు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గత
30 ఏళ్లుగా గెలిచిన దాఖలా లేదు. 2017 నుంచి 2022 మధ్యకాలంలో 16 మంది
ఎమ్మెల్యేలు హస్తాన్ని వీడి కమలం గూటికి చేరడం కాంగ్రెస్ పార్టీ నాయకత్వ
లోపానికి అద్దంపడుతోంది.
ఆప్‌తో ఎవరికి ముప్పు?
ఢిల్లీ, పంజాబ్‌ల బలంతో కాంగ్రెస్‌ను వెనక్కు నెట్టి ఇక్కడ ప్రత్యామ్నాయంగా
ఎదగాలని ఆప్ అధినేత కేజ్రీవాల్ వ్యూహాలు రచిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఆప్,
ఎంఐఎం పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ ఓటు బ్యాంకు చీలిపోతుందన్న వాదనలు
వినిపిస్తున్నాయి. ఆప్ 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు, రూ.3వేల నిరుద్యోగ భృతి,
మహిళలకు నెలవారీగా రూ.వెయ్యి పింఛను నినాదాలతో సంక్షేమరాగం వినిపించడం వల్ల
పట్టణ ప్రాంతాల్లోని బీజేపీ ఓటుకు భారీగా గండిపడే అవకాశం ఉంటుందని, అది తమకు
మేలు చేస్తుందని కాంగ్రెస్ నమ్ముతోంది.